మేడ్చల్, జూన్14 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూములలో కబ్జాదారులు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 16 మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు పెద్ద సంఖ్యలో వెలుస్తున్నాయి. జిల్లాలోని కొందరు నాయకులు.. స్థానిక అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ భూములు ఉండే ప్రాంతాల్లో సర్వే నంబర్లు సృష్టించి మరీ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి సొమ్ముచేసుకుంటున్నారు.
జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల పరిధిలో ఆయా భూములకు ఉన్న డిమాండ్‌ను బట్టి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విక్రయించుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇలాంటి నిర్మాణాలు కొనుగోలు చేస్తున్న నిరుపేదల భవిష్యత్‌ను అంధకారంలోకి నెడుతున్నారు. నిర్మాణాలను రెండు రోజులలో పూర్తిచేసి ఇంటి నెంబర్‌ను ఇచ్చేందుకు అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారంటే అవినీతి యే రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆయా మున్సిపాలిటీల పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై మున్సిపల్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా చర్యలు మాత్రం తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలతో పాటు స్థానిక తహసీల్దార్ కార్యాలయాలలో ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో అక్రమ నిర్మాణాలపై వందలాది సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికంగా ఉండే మున్సిపల్ అధికారులను కోరితే ఇంటి స్థలం పట్టా ఉందని పట్టాపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని అధికారులు దాటవేస్తున్నారాన్ని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా బోడుప్పల్, పీర్జాదిగూడ, పోచారం, మేడ్చల్, దుండిగల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో పెద్ద సంఖ్యలో అక్రమ నిర్మాణాలు
చేపడుతున్నారు.
మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలనలో అక్రమ నిర్మాణాల సంఖ్య మరింత పెరిగింది. ఆయా అధికారులు మున్సిపాలిటీల పర్యవేక్షణను పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆటగా మారింది పరిస్థితి. స్థానిక నాయకులు చేతులు తడపడంతో ప్రత్యేకాధికారులు అక్రమ నిర్మాణాలను చూసిచూడనట్లు వదిలేస్తున్నట్లుకూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.