Land Grabbing | దుండిగల్, నవంబర్18: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ- దుండిగల్ మండలంలో ప్రభుత్వ భూములు హారతికర్పూరంలా కరిగిపోతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గతంలో ఎప్పుడో ఇచ్చిన పట్టాల పేరుతో దందాను కొనసాగిస్తుండగా, అవగాహన లోపంతో రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కిందిస్థాయి సిబ్బంది ఒకరు నిర్మాణదారులతో కుమ్మక్కై నిర్మాణానికి ఓ రేటును నిర్ణయించి.. వసూలు చేయడంతో పాటు అధికారులకు అందులో వాటా అందిస్తున్నట్లు తెలుస్తున్నది.
తాజాగా మండల పరిధిలోని డీ పోచంపల్లి సర్వేనంబర్ 120/6లో ఓ వ్యక్తి 120/1 పేరిట ఉన్న ఇంటిపట్టాను అడ్డుపెట్టుకుని సుమారు రూ .50లక్షల విలువైన 250 గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. రెండు, మూడు రోజులుగా సదరు స్థలంలో ఓ కంటైనర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు చుట్టూ కడీలు వేయడం గమనార్హం. రెవెన్యూ కార్యాలయానికి కూత వేటు దూరంలోనే ఈ తతంగం నడుస్తున్నా మండల తహసీల్ అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు నెలల కిందట ఇక్కడ పనిచేస్తున్న గిర్ధావర్(ఆర్ఐ)లు ఇద్దరు ఒకే సారి ఇక్కడి నుంచి బదిలీకావడంతో కొత్తగా విధుల్లో చేరిన ఉద్యోగులకు ఇక్కడి ప్రభుత్వ భూములపై ఎంత మాత్రం అవగాహన లేదని తెలుస్తున్నది. ఇదే అదునుగా భావించిన ఓ గ్రామస్థాయి ఉద్యోగి చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దసరా పండుగ నుంచి వారాంతపు సెలవు దినాల్లో సర్వేనంబర్ 120లో రాత్రికి రాత్రే గదులు నిర్మించి, తెల్లారే సరికి సున్నం వేసి కిరాయి మనుషులను దింపుతున్నట్లు సర్వత్రా ఆరోపణలు ఉన్నాయి. అక్రమ నిర్మాణదారులకు అండగా ఉంటున్న సదరు గ్రామస్థాయి ఉద్యోగి వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసి జేబులు నింపుకొంటున్నట్లు సమాచారం.
ఎవరైనా వీటిపై గిర్ధావర్, తహసీల్దార్‌కు ఫిర్యా దు చేస్తే సదరు నిర్మాణాలకు పట్టాలు ఉన్నాయని మభ్యపెడుతున్నట్లు సమాచారం. ఫిర్యాదుదారులను, కొందరు అధికారులను మేనేజ్ చేస్తూ తన చెప్పుచేతల్లో ఉంచుకున్నట్లు తహసీల్ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో జనం ఆరోపణలు గుప్పిస్తున్నట్లు సమాచారం. గడిచిన రెండు నెలల కాలంలో పదులసంఖ్యలో ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు జరిగినా.. అధికారులు అడ్డుకట్ట వేయకపోవడమే అందుకు నిదర్శనంగా నిలుస్తుందంటున్నారు స్థానికులు. అయితే సదరు గ్రామస్థాయి ఉద్యోగిని అవినీతి ఆరోపణలతో ఓ సారి విధుల్లో నుంచి తొలగించానంటున్న తహసీల్దార్ మరోసారి మాట మారుస్తూ సరిపడా సిబ్బంది లేని కారణంగా తామే అతడి సేవలు వినియోగించుకుంటున్నామని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే విషయమై వివరణ కోరేందకు గండిమైసమ్మ-దుండిగల్ మండలం తహసీల్దార్ మతిన్‌ను ఫోన్లో సంప్రదించేందుకు యత్నించగా, ఆయన ఎంతకూ స్పందించకపోవడం గమనార్హం. కాగా, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు తమపై చర్యలు తీసుకునే దమ్ము ఎవరికి ఉంది.. అనే ధీమాతో ఉన్నట్లు సమాచారం. ఇక్కడ జరుగుతున్న భూ ఆక్రమణలపై ఆర్డీవో స్పందించి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.