అమీర్‌పేట్, ఏప్రిల్ 17: పదేండ్లలో కేసీఆర్ పాలనలో ఎదురుకాని నీటి సమస్య ఇప్పుడెందుకు వచ్చిందనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచించడం లేదని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రశ్నించారు. ప్రభుత్వం కనీసం ప్రజలకు మంచినీటిని కూడా అందించే పరిస్థితిలో కూడా లేదన్నారు. బూతు మాటలు మాట్లాడేందుకు సమయం ఉంది కానీ, తాగేందుకు నీరు లేక అల్లాడుతున్న ప్రజల గొంతు తడిపేందుకు చర్యలు తీసుకునే సమయం సీఎంకు లేకపోవడం సిగ్గుచేటన్నారు.
ట్యాంకర్ల ద్వారా నీటిని అమ్ముకుంటున్న ప్రభుత్వం, నల్లాల ద్వారా నీరందించడంలో విఫలమైందన్నారు. నల్లా నీరు ఇవ్వకుండా, ట్యాంకర్ల ద్వారా నీటి అమ్మకాలు జరిపితే ఎక్కడికక్కడ రిజర్వాయర్ల దగ్గర నీటి ట్యాంకర్లను అడ్డుకుంటామన్నారు. తక్షణమే నీటి సమస్యను పరిష్కరించకపోతే ప్రజలను చైతన్యపరిచి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా సెక్రటేరియట్ ముట్టడికి దిగుతామని హెచ్చరించారు.
సనత్‌నగర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొలను బాల్‌రెడ్డితో కలిసి సనత్‌నగర్, బీకేగూడ డివిజన్లలో నెలకొన్న నీటి ఎద్దడిని పరిశీలించారు. బీకేగూడ సీ-టైపు క్వార్టర్స్, సుభాశ్‌నగర్, కైలాశ్‌నగర్, డీఎన్ఎం కాలనీల్లో పర్యటించిన ఎమ్మెల్యే తలసానికి నీటి సమస్యలపై ఫిర్యాదులు అందాయి. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సుభాశ్‌నగర్ బసీంత సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాల్‌రాజ్ ఆధ్వర్యంలో కైలాశ్‌నగర్, సుభాశ్‌నగర్ బస్తీ మహిళలు పెద్దసంఖ్యలో ఎమ్మెల్యే తలసానికి మంచినీటి సరఫరాపై ఫిర్యాదులు చేశారు. తక్కువ ప్రెషర్‌తో వస్తున్న నీటి సరఫరా గురించి జలమండలి అధికారులను నిలదీశారు.