మేడ్చల్, జూలై 9 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గంలో ఏఓసీ రోడ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి చేసిన కృషి ఫలిచింది. సఫిల్‌గూడ, మల్కాజిగిరి, ఆర్కేపురం, సైనిక్‌పూరి, ఈసీఐఎల్ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలను ఆర్మీ ఆర్డినెన్స్ సర్కిల్ ఏఓసీ రహదారుల నుంచి వెళ్లాల్సి వస్తుంది. దీంతో భద్రత దృష్ట్యా ఆర్మీ అధికారులు తరచు ఈస్ట్ మారేడ్‌పల్లి ఏఓసీ గేటును మూసివేస్తుంటారు.
గేటు మూసివేస్తున్న క్రమంలో ప్రజలు మల్కాజిగిరి మీదుగా మెట్టుగూడ నుంచి అదనంగా 5 కిలో మీటర్లు ప్రయాణించి సికింద్రాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మల్కాజిగిరి నియోజవకర్గ ప్రజల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే క్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో పలుమార్లు ఈ సమస్యను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి పలుమార్లు విన్నవించారు. ఇటీవల ఈ మార్గంలో 6 కిలో మీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినైట్లెంది.
మారేడ్‌పల్లి ఏఓసీ నుంచి..
మారేడ్‌పల్లి ఏవోసీ నుంచి మారేడ్‌పల్లి, మహేంద్రహిల్స్, ఉత్తమ్‌నగర్, సఫిల్‌గూడ ఆర్కేపురం వరకు 6 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో వల్ల రక్షణశాఖ 35 ఎకరాల భూమిని కోల్పోతున్న క్రమంలో సుమారు రూ.442 కోట్ల నష్టపరిహారం చెల్లిస్తామని జీహెచ్ంఎసీ ప్రతిపాదించగా ఆర్మీ అధికారులు అంగీకరించారు. దీంతో ఇతర ప్రాంతాలో రక్షణ శాఖకు పరిహారంగా వంద ఎకరాలు ఇవ్వనున్నారు. అయితే త్వరలోనే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి టెండర్లను వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కృషి వల్లే ఎలివేటెడ్ కారిడార్ సాధ్యమయ్యిందని మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలు హర్హం వ్యక్తం చేస్తున్నారు.