‘కేవలం ఏడు ప్లాట్లు అమ్మితేనే ఎకరానికి రూ.151 కోట్ల ఆదాయం వచ్చినప్పుడు ఇంకా ఉన్న వందల ఎకరాలు అమ్మితే మరెంత రావాలే. అందుకే ఆలస్యం చేయొద్దు. ఖాళీ జాగల జాబితా తీయండి., లీజులన్నీ రద్దు చేయండి. మార్కెట్లో పెట్టేద్దాం.. కోట్లకు కోట్లు కొల్లగొట్టేద్దాం..’ అని రాష్ట్ర సర్కార్ హెచ్ఎండీఏకు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తున్నది.
సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఆధీనంలో ఉన్న భూముల లెక్కలన్నీ తేల్చాలని, లీజు పత్రాలన్నీ రద్దు చేసి కొత్తగా మార్కెట్లో పెట్టి మరింత క్యాష్ చేసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. కేవలం 100 ఎకరాలకు పైగా అమ్మితేనే కండ్లు బైర్లుకమ్మే ఆదాయం రావడంతో హెచ్ఎండీఏ వద్ద ఉన్న మిగతా 250 ఎకరాల భూమిపై సర్కార్ కన్నేసినట్టు స్పష్టమవుతున్నది.
సర్కార్ ధనదాహం..
ఇటీవల హెచ్ఎండీఏ భూముల వేలంతో వచ్చిన ఆదాయంతో రేవంత్ సర్కార్‌కు మరింత ఆశలు పెంచింది. విలువైన భూములను అమ్మి ఖజానా నింపుకొనేందుకు మరిన్ని ఎత్తుగడలు వేస్తున్నది. అథారిటీకి ఓఆర్ఆర్ పరిధిలోని విలువైన భూములు, లీజు ప్రతిపాదికన కట్టబెట్టిన ల్యాండ్ పార్శిళ్ల జాబితాను తీయాలని ఆదేశించినట్టు తెలుస్తున్నది. అవసరాన్ని బట్టి ఆ భూములను అమ్ముకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడమే కాకుండా, ఎదురయ్యే లీజు, న్యాయపరమైన చిక్కులు, ఆక్రమణల తీరు వంటి వాటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరినట్లుగా సమాచారం.
కాసులు కురిపిస్తున్న కోకాపేట..
హెచ్ఎండీఏ డెవలప్ చేసిన కోకాపేట్ వెంచర్‌లోని ప్లాట్లు ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దాదాపు 250 ఎకరాల్లో వెంచర్‌ను డెవలప్ చేయగా ఇప్పటివరకు 100 ఎకరాలకు పైగా విక్రయించారు. మిగిలిన భూముల్లో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల వంటి మౌలిక వసతులకు వినియోగిస్తూ దశలవారీగా వేలం నిర్వహిస్తూ ఆదాయం సమకూర్చుకుంటున్నది. వీటితోపాటు మరికొన్ని చోట్ల హెచ్ఎండీఏ డెవలప్ చేసిన లే అవుట్లు ఉండగా వీటిలోని ప్లాట్లను కూడా బేరం పెడుతూ వస్తున్నది. వాటిని నగరంలో మార్కెట్ ధరలకు అనుగుణంగా డిమాండ్ రావడంతో సర్కార్‌కు భారీ ఆదాయమే సమకూరుతున్నది. ఇటీవల నిర్వహించిన వేలంతోనే ఖజానాకు రూ.3,800 కోట్ల ఆదాయం చేరింది. ఇందులో కేవలం 7 ప్లాట్ల అమ్మకంతోనే ఎకరానికి రూ.151 కోట్ల మేర అత్యధికంగా ధర పలికిన విషయం తెలిసిందే.
ఔటర్ చుట్టూ విలువైన భూములు..
11 జిల్లాలకు విస్తరించి, ప్రతిపాదిత రీజినల్ రింగు రోడ్డు వరకు కార్యకలాపాలు నిర్వహించే హెచ్ఎండీఏకు ఔటర్ చుట్టూ వందల ఎకరాల విలువైన భూములు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని గతంలో లేఅవుట్లుగా డెవలప్ చేసి అమ్మేయగా, మరికొన్నింటిని పలుసంస్థలకు లీజు ప్రాతిపదికన అప్పగించింది. ప్రభుత్వానికి భూముల వేలం ద్వారా అంచనాకు మించి ఆదాయం రావడంతో మిగతా భూమిని ఎలా వినియోగంలోకి తేవాలనే కసరత్తు మొదలుపెట్టి భూముల చిట్టాను సిద్ధం చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. గతంలో కోకాపేట్లో సెజ్‌కు ఇచ్చిన 70 ఎకరాలు, పెద్ద అంబర్పేట్, నార్సింగి, మూసాపేట్ వంటితోపాటు, లీజు ప్రతిపాదికన ఇతర వ్యక్తులు, సంస్థలకు కేటాయించిన భూముల జాబితాను హెచ్ఎండీఏ సిద్ధం చేస్తున్నది. కాగా, లీజు రద్దుతో వెంటనే వేలానికి ప్రణాళికలు అమలులోకి రానుండడంతో లీజు భూములన్నీ త్వరలోనే అంగట్లోకి వస్తాయనే చర్చ హెచ్ఎండీఏ వర్గాల్లో జోరుగా సాగుతున్నది.