HCU | సిటీబ్యూరో: హెచ్‌సీయూలోని 400 ఎకరాల భూమిని చదును చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పంపించిన బుల్డోజర్లు వెనక్కి వెళ్లినా పోలీసుల నిర్బంధం కొనసాగుతున్నది. క్యాంపస్ అంతటా పోలీసులు గస్తీ కాస్తున్నారు. మెయిన్ గేట్ వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు. అనుమతి లేనిదే ఎవ్వరినీ యూనివర్సిటీలోకి అనుమతించడంలేదు. విద్యార్థులను సైతం ఐడీ కార్డు చూపిస్తేనే బయటకు, లోపలికి అనుమతిస్తున్నారు. దట్టమైన అడవిని తొలగించి చదును చేసిన ప్రాంతంలో బారికేడ్లను తొలగించలేదు. పోలీసు బందోబస్తు కొనసాగుతున్నది. విద్యార్థులను సైతం అటువైపు రానీయడంలేదు. చెట్లు, భారీ పొదలను నరికేసిన ప్రాంతాన్ని ఫొటోలు కూడా తీయనీయడం లేదు. కొంత మంది విద్యార్థులు రేవంత్‌రెడ్డి సర్కార్ చేసిన విధ్వంసాన్ని ఫోన్లలో చిత్రీకరించే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారి ఫోన్లను లాగేసుకున్నారు. అటువైపు వచ్చినా.. ఫొటోలు తీసినా కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తామని హెచ్చరిస్తున్నారు.
హెచ్‌సీయూ భూముల్లో కాంగ్రెస్ సర్కారు సృష్టించిన విధ్వంస కాండ బయటపడుతుందనే చదును చేసిన ప్రాంతంలోకి అనుమతించడంలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వందలాది మహా వృక్షాలను నరికేసి పడేసిన కుప్పలు బయటపడతాయని తమను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు ఆపేసి బుల్డోజర్లు వెనక్కి వెళ్లాక కూడా అటువైపు ఎందుకు వెళ్లనీయడంలేదని నిలదీస్తున్నారు. యూనివర్సిటీలో ఆందోళనలు విరమించాక విద్యార్థులపై నిర్బంధం దేనికి కొనసాగిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. యూనివర్సిటీలో ఇంకా పోలీసుల బందోబస్తు ఎందుకు చేపడతున్నారని అడుగుతున్నారు. క్యాంపస్ నుంచి పోలీసులను వెనక్కి పంపించి విద్యార్థులపై నిర్బంధాన్ని ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నారు.
హెచ్‌సీయూను కాపాడుకుందామంటూ ఛేంజ్డాట్ఆర్గ్లో సంతకాల ఉద్యమం కొనసాగుతుంది. ఇప్పటికీ 3.21లక్షల మంది హెచ్సీయూకు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తూ సంతకాలు చేశారు.