Heavy Rains: హైదరాబాద్ నగరంలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురవనున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికతో పాటు హైడ్రా సూచన మేరకు గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ (GHMC) పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
‘వాతావరణ శాఖ సూచన ప్రకారం 13-08-2025 బుధవారం, 14-08-2025 గురువారం నాడు జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముంది. అందుకని.. వర్షం కారణంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకూడదనే ఉద్దేశంతో ఈ రెండు రోజులు నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు హాఫ్ డే హాలీ డే ఇవ్వాలి. అన్ని స్కూళ్లు మధ్యాహ్నానికల్లా బంద్ కావాలి’ అని విద్యాశాఖ డైరెక్టర్ వెల్లడించారు.
నగరంలో భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో హైడ్రా అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు శాఖల అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. కాసేపటికే రెండు రోజులు సెలవుల మంజూరుకు సంబంధించిన ప్రకటన వెలువడింది.
హనుమకొండ, వరంగల్ జనగామ, యాదాద్రిభువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. అందుకని.. జీహెచ్ఎంసీతో పాటు ఈ ఐదు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.