హైదరాబాద్: శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో (Travels Bus) భారీ చోరీ జరిగింది. ఓ ప్రయాణికురాలి బ్యాగ్‌లో రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను గుర్తుతెలియన వ్యక్తులు అపహరించారు. గుర్తించిన మహిళ డయల్ 100కు కాల్ చేసింది. బస్సు డ్రైవర్‌కు తెలపడంతో బస్సును డ్రైవర్ అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మండపేట నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా, బస్సుల్లో ఉన్న 40 మందిని పోలీసులు చెక్‌చేశారు. అయినా ఎవరివద్ద అవి లభించకపోవడంతో.. బస్సు ఎక్కడెక్కడ ఆగింది, మధ్యలో ఎవరైనా దిగారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె వద్ద ఆభరణాలు ఉన్నట్లు ఎవరైనా తెలుసా అని ఆరాతీస్తున్నారు.
బస్సు ఎక్కెటప్పుడు తన బ్యాగులో రూ.15 లక్షల విలువగల బంగారు ఆభరణాలు ఉన్నాయని బాధితురాలు తెలిపారు. బ్యాగు తన వద్దే ఉందని, అయినా ఆభరణాలు మాయమయ్యాయని విలపించారు. పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరారు. అయితే ఉదయం 6 గంటల నుంచి తమను పోలీస్ స్టేషన్లో ఉంచారని, చిన్న పిల్లలు కూడా ఉన్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బ్యాగులను ఇప్పటికే తనిఖీ చేశారని, అయినా తమను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు పంపించడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.