సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి తరచూ గోవాకు వెళ్లే వారి వ్యవహారాలపై హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్‌న్యూ) దృష్టి సారించింది. హైదరాబాద్‌లో డ్రగ్ విక్రేతలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అదేవిధంగా.. గోవాలో ఉన్న డ్రగ్ మాఫియా కింగ్ పిన్‌లను కూడా అరెస్టు చేస్తున్న హైదరాబాద్ పోలీసులు వారిని జైలుకు పంపిస్తున్నారు. గోవాలో డ్రగ్ స్మగ్లింగ్‌లో డాన్లుగా కొనసాగుతున్న డిసౌజాను ఇటీవలే హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
డ్రగ్ డాన్లుగా కొనసాగుతున్న సంజా గౌవేకర్, ఎడ్విన్ వంటి వారి కోసం హెచ్‌న్యూ వేట కొనసాగిస్తున్నది. హైదరాబాద్‌కు ఎక్కువగా గోవా నుంచే డ్రగ్ సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో గోవా, హైదరాబాద్ డ్రగ్ లింక్‌ను తెగొట్టేందుకు హెచ్‌న్యూ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గతంలో అరెస్టయిన వారిచ్చిన సమాచారంతో గోవాపై దృష్టి సారించారు. ఇదిలా ఉండగా.. డ్రగ్‌కు అలవాటుపడిన కొందరు హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్తున్నారని, అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి తరచూ గోవాకు వెళ్తున్న వారిపై దృష్టిపెట్టారు.