సిటీబ్యూరో: గ్రేటర్లో జీఐఎస్ సర్వే అబాసుపాలవుతున్నది. గతేడాది జూలైలో ఈ సర్వేను ప్రారంభించగా ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఏజెన్సీ నిర్లక్ష్యంతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతున్నది. 8 నెలలుగా 30 సర్కిళ్లకు కేవలం 5 సర్కిళ్లలో మాత్రమే పూర్తి చేశారు.
సర్వేలో భాగంగా..
650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్ మహానగరంలో రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలతో కలిపి సుమారు 19 లక్షల 43వేల నిర్మాణాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. అందులో కమర్షియల్గా 2.7 లక్షల భవనాలు ఉన్నాయి. సర్వేలో భాగంగా ఇప్పటి వరకు కాప్రా, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్నగర్, సరూర్నగర్ 5 సర్కిళ్లలో మాత్రమే వంద శాతం డ్రోన్ సర్వే పూర్తయింది.
ఏజెన్సీపై చర్యలేవీ?
సర్వేకు జీహెచ్ఎంసీ దాదాపు రూ.22 కోట్ల మేర ఖర్చు చేస్తున్నది. ప్రతి ఆస్తిని, నిర్మాణాన్ని, ఖాళీ ప్లాట్లను, నివాసాలను, వ్యాపార భవనాలను గుర్తించి మ్యాపింగ్ చేసేందుకు గరిష్ఠంగా 18 నెలల గడువు తీసుకుని 19.43 లక్షల ఆస్తులను గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. గడిచిన 8 నెలలలో ఐదు సర్కిళ్లలో మాత్రమే సర్వే ప్రక్రియను పూర్తి చేశారు. ఏజెన్సీపై కొందరు అధికారులు అండగా నిలబడుతుండడం, చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.