మాదన్నపేట, అక్టోబర్ 4: ఆర్థిక లావాదేవీల వివాదాల నేపథ్యంలో మేనమామ, మేనత్త కలిసి అభంశుభం తెలియని ఓ చిన్నారిని హత్య చేసిన సంఘటన మాదన్నపేట పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. అడిషనల్ డీసీపీ కె.శ్రీకాంత్ శనివారం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిందితుడు ఎ-1 సమీ అలీ(36), నిందితురాలు ఎ-2 యాస్మిన్ బేగం (26) మైనర్ బాలికకు మామ, అత్త అవుతారు. బాలిక తండ్రి వారిద్దరితో ఆర్ధిక వివాదాలను కలిగి ఉన్నాడు.
కాగా నిందితుడికి 3 సంవత్సరాల కూతురు ఉండేది.. ఆమె గత నవంబర్ నెలలో అనారోగ్యంతో మరణించింది. అయితే తన కూతురు బాలిక తల్లిదండ్రుల మాయజాలం కారణంగానే మృతి చెందిందని నిందితుడు అనుమానంతో ఉన్నాడు. డబ్బుల విషయంలో బాలిక తల్లితండ్రులు క్రమం తప్పకుండా నిందితుడి ఇంటికి వెళ్లేవారు. పిల్లలతో తరుచుగా ఇంటికి రావడం డబ్బులు అడగడం విసుగు చెంది బాలిక తల్లిదండ్రుల పై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో గతనెల 30న ఎప్పటిలా తన పిల్లలను తీసుకొని నిందితుడి ఇంటికి వచ్చాడు. పని ఉందని బాలికను మామఅత్త వద్ద వదిలి బయటకు వెళ్లాడు.
ఆదే అదనుగా భావించి నిందితులిద్దరూ బాలికను తాడుతో కట్టి ఫస్ట్ ఫ్లోర్లోని ట్యాంకులో పడేశారు. బాలిక తల్లితండ్రుల ఫిర్యాదుతో.. క్లూస్ టీం సహయంతో మామ, అత్తనే ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. నిందితులను అరెస్టు చేసినట్లు అడిషనల్ డీసీపీ తెలిపారు. నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని అడిషనల్ డీసీపీ హెచ్చరించారు. పిల్లలను ఎవరి వైద్దెనా వదిలే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో సీఐ ఆంజనేయులు, డీఐ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.