Hyderabad | బంజారాహిల్స్, జూన్ 4 : పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి బాలికను లోబర్చుకుని లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న బాలిక(17)ని బీహార్ నుంచి వచ్చి గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న సునీల్ యాదవ్(21) అనే యువకుడు ఏడాది నుంచి మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి బంజారాహిల్స్ ప్రాంతంలోని తన స్నేహితుడి గదికి పలుమార్లు తీసుకువచ్చి లైంగికదాడికి పాల్పడ్డారు. ఇటీవల అతడికి మరో యువతితో సంబంధం ఉందని తెలిసిన బాలిక నిలదీసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మరో యువతితో ఎందుకు తిరుగుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన సునీల్ యాదవ్పై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.