వెంగళరావునగర్, అక్టోబర్ 6: ఆనందోత్సహాలతో జరిగే వేడుగల్లో విషాదం ఆలముకుంది. గృహ ప్రవేశ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఇంటి డెకరేషన్ లైట్ల విద్యుత్తు తీగలు తాకి ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల కథనం ప్రకారం.. సనత్ నగర్ ఉదయ్ నగర్లో ప్రైవేట్ ఉద్యోగి కాసబోయిన శ్రీరాములు తమ కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆదివారం సుభాష్ నగర్లో నివాసం ఉండే తమ బంధువు వెంకటస్వామి గృహ ప్రవేశ వేడుకకు శ్రీరాములు తన భార్య మానస, కుమార్తెలు మేఘన(8), ప్రణవి(7)తో కలిసి వెళ్లారు.
అదే రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు గ్రౌండ్ ఫ్లోర్లో ఫంక్షన్లో భోజనం చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురు పిల్లలు టెర్రస్‌పై ఆడుకోసాగారు. ప్రమాదవశాత్తు ఇంటి విద్యుత్ డెకరేషన్ లైట్ల విద్యుత్తు తీగల జాయింట్‌ను తాకి బాలిక ప్రణవి స్పృహ కోల్పోయి పడిపోయింది. దీంతో సనత్‌నగర్‌లోని ప్రైవేట్ దవాఖానాకు తరలించగా.. అప్పటికే పాప మృతి చందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.