ఎర్రగడ్డ, ఏప్రిల్ 21 : నాలుగేళ్ళ పాపకు నూరేళ్లు నిండాయి. బాత్రూమ్ లో జారిపడి అపస్మారకస్థితిలోకి వెళ్లి..చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. నిస్తేజంగా పడిన కుమార్తెను గుండెలకు హత్తుకుని లే బిడ్డా..లే అంటూ ఆ తల్లి గుండెలవిసేలా రోధించడం అందర్నీ కంటతడి పెట్టించింది. విషాదఛాయలు అలముకున్న ఈ ఘటన బోరబండలో చోటుచేసుకుంది. బోరబండ స్వరాజ్ నగర్ లో పశ్చిమ బెంగాల్ కు చెందిన పెయింటర్‌గా పనిచేసే ఎండీ రఫీక్.. తమ కుటుంబం తో కలిసి నివాసం ఉంటున్నారు.
శనివారం మధ్యాహ్నం దంపతులు ఎండీ రఫీక్, నిఫా ఇంట్లో ఉన్న సమయంలో వారి ముద్దుల గారాలపట్టి లామ్య (4) బాత్రూమ్ లోకి వెళ్ళింది. అక్కడ బాత్రూమ్ లో జారిపడి తలకు తీవ్రగాయాలై స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. జారిపడ్డ శబ్దం విన్న తల్లిదండ్రులు లామ్యను నిలోఫర్ దవాఖానకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పాప మృతి చెందింది. బిడ్డా.. అమ్మని వచ్చాను చూడరా.. లే బిడ్డా..లెమ్మంటూ ఆ తల్లి రోధించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. ఈ మేరకు బోరబండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.