బంజారాహిల్స్, ఏప్రిల్ 24: వేసవి సెలవుల్లో బంధువుల ఇంట్లో గడుపుదామని బయలుదేరిన బాలిక రోడ్డు ప్రమాదంలో మరణించింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. రహ్మత్‌నగర్‌లో నివాసి గురవయ్య కొబ్బరి బోండాల వ్యాపారి. అతడికి ఇద్దరు పిల్లలు. కుమార్తె శిరీష(15) పదో తరగతి చదువుతోంది. శిరీష చిన్నమ్మ కళ్యాణి కుటుంబం ఫిలింనగర్లో ఉంటోంది. కళ్యాణి భర్తతో కలిసి వారి సొంతూరు ఖమ్మం వెళ్లగా.. ముగ్గురు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. శిరీషకు పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో వేసవి సెలవుల్లో భాగంగా వారం రోజులపాటు చిన్నమ్మ ఇంట్లో ఉండి రావాలని శిరీష భావించింది.
దీంతో కళ్యాణి కొడుకు (14)కు ఫోన్ చేయగా.. అతడు మంగళవారం రాత్రి బైక్‌పై శిరీషను ఎక్కించుకుని ఫిలింనగర్‌కు బయలుదేరాడు. యూసుఫ్‌గూడ మెట్రోస్టేషన్ సమీపంలో ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో బైక్ ప్రమాదానికి గురైంది. వెనుకాల కూర్చున్న శిరీష కిందపడిపోవడంతో బస్సు వెనుక చక్రం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన మైనర్‌పై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నదని పోలీసులు తెలిపారు.