సిటీబ్యూరో, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ) : రోమ్ నగరం తగలబడుతుంటే రోమన్ చక్రవర్తి ఫిడేల్ వాయించిన చందంగా.. నగరంలో డీలిమిటేషన్ ప్రక్రియపై జీహెచ్ఎంసీ ముందుకెళ్తున్నది. జనాభా, హద్దుల నిర్ధారణలో అశాస్త్రీయ విధానాలపై నిరసనలు, అభ్యంతరాలు, కోర్టులను ఆశ్రయించి బల్దియా తీరును ఎండగడుతుంటే.. మరోవైపు అడ్డగోలుగా గూగుల్ మ్యాపులతో రూపకల్పన డివిజన్లతోనే బల్దియా విస్తరణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేసేశారు. సోమవారం డీలిమిటేషన్ ప్రక్రియపై 80కిపైగా పిటిషన్లు కోర్టుకు చేరగా.. వీటన్నింటినీ కొట్టివేయడంతో బల్దియా అధికారుల అసంబద్ధమైన విస్తరణకు మరింత బలం చేకూరింది.
వాటిన్నింటిపై స్పందించలేదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో విస్తరణ అనివార్యమని కోర్టు తేల్చి చెప్పడంతో.. ఇప్పటివరకు ఈ అంశంలో సాగుతున్న వివాదానికి హైకోర్టు ఫుల్స్టాప్ పెట్టినట్లు అయింది. దీంతో ఆపరేషన్ బల్దియాను కార్యాలయాల్లో తయారు చేసిన నివేదికల ఆధారంగా తుది నోటిఫికేషన్‌తో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం. దీంతో రేపోమాపో డీలిమిటేషన్ తుది జాబితాను కాంగ్రెస్ సర్కారు విడుదల చేయనున్నది.
వార్డుల విభజన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించినా, ఎట్టకేలకు సర్కారు అనుకున్నట్లుగా విస్తరణ ప్రక్రియను ముగించనున్నది. తొలుత ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, పిటిషనర్ల అభ్యంతరాలకు అనుగుణంగానే వార్డుల విభజన చేయాలని సూచించింది. కానీ అందుకు తగినట్లుగా పిటిషనర్లకు మ్యాపులు, జనాభాతో కూడిన నివేదికను ఇచ్చి బల్దియా చేతులు దులుపుకొని, ఎలాంటి మార్పులతో సంబంధం లేకుండా మహానగర విస్తరణకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 9న ముసాయిదాను జీహెచ్ఎంసీ కమిషనర్‌ను జారీ చేశారు. మరుసటి రోజు నుంచే ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలను స్వీకరించారు.
తొలి రోజైన ఈ నెల 10న 40 అభ్యంతరాలను సర్కిల్, జోన్, ప్రధాన కార్యాలయాల్లో స్వీకరించారు. వార్డుల విభజనలో బల్దియా అమలు చేసిన విధానాలు, అస్పష్టమైన జనాభా, పరిధి, విస్తీర్ణం, విలీనం, వార్డుల మధ్య ఉన్న జనాభా వ్యత్యాసం వంటి అంశాలపై దాదాపు 10వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయి. కానీ వాటిలో కొన్నింటిని పరిగణనలోకి తీసుకుని డీలిమిటేషన్ ప్రక్రియను డిసెంబర్ 31లోపు పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆరాపడుతున్నారు. బల్దియా డీలిమిటేషన్ ప్రక్రియపై తొలుత రెండు పిటిషన్లపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం పలు సూచనలు జారీ చేసింది.
పిటిషన్లర్లకు సంబంధిత వార్డుల మ్యాపులను అందజేయాలని, అనుమానాలను నివృత్తి చేయాలని సూచించింది. కానీ సోమవారం దాఖలైన 80కిపైగా పిటిషన్లను గంపగుత్తగా కొట్టివేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో డీలిమిటేషన్ అంశాలపై కలగజేసుకోలేమని, వార్డుల విభజన సర్వసాధారణమేనని చెప్పినట్లు పిటిషన్లను పక్కనపెట్టేసింది. దీంతో సోమవారం లంచ్ మోషన్లో జరిగిన విచారణలోనే పిటిషనర్లకు తేల్చి చెప్పడంతో… బల్దియా డీలిమిటేషన్ ప్రక్రియకు న్యాయపరమైన అడ్డంకులు తొలగించినట్లు అయింది. దీంతో కోర్టు విచారణతో సంబంధం లేకుండానే ఓవైపు కోర్టు విచారణ, మరోవైపు అభ్యంతరాల పరిశీలన చేస్తూ చివరకు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా… నివేదికతో సిద్ధమయ్యారు.
డీలిమిటేషన్‌పై పలువురు కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో… డిసెంబర్ 31లోపు పెట్టుకున్న నిర్ణీత గడువులోగా విస్తరణ పూర్తి చేసేందుకు కసరత్తు చేశారు. అభ్యంతరాలు, జనాభా వ్యత్యాసాల సవరణకు తావు లేకుండానే, సలహాలు, సూచనలను బుట్టదాఖాలు చేసినట్లు వార్డుల విభజన చేసి ప్రత్యేక నివేదికను సర్కారుకు అందజేసినట్లుగా తెలిసింది. 300 వార్డులకు ఇప్పటివరకు వచ్చిన 10వేల అభ్యంతరాలను తూతూ మంత్రంగానే పరిశీలించిన బల్దియా ఉన్నతాధికారులు… అభ్యంతరాలు, ఆక్షేపణలు, సూచనలు, కోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా నివేదికను సర్కారు చేతిలో పెట్టారు.
ప్రత్యేక కమిటీల ద్వారా జీహెచ్ఎంసీకి వచ్చిన 10 అభ్యంతరాల నుంచి కేవలం 70-80 డివిజన్ల పేర్లు, సరిహద్దులను మార్పు చేసినట్లు చెబుతున్నారు. కానీ ఈ అంశంలో తుది నోటిఫికేషన్ వచ్చేంత వరకు నిర్ధారణకు రాలేమని పలువురు నగరవాసులు స్పష్టం చేశారు. ప్రధానంగా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఇచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. వీటిని ఎంతవరకు ఆచరణలో పెట్టినదీ తుది నోటిఫికేషన్ ద్వారానే చెప్పే వీలు ఉంటుందని బల్దియా వర్గాలు పేర్కొన్నాయి.
బల్దియా విస్తరణ విషయంలో కాంగ్రెస్ సర్కారు ఉద్దేశపూర్వకంగా ముందుగా అనుకున్నట్లుగానే జాబితాను సిద్ధం చేసింది. ఈ విషయంలో అభ్యంతరాలకు తావు లేకుండా, సూచనలు, రాజకీయ విమర్శలు, కోర్టు వివాదాలను పట్టించుకోకుండా గుడ్డిగా ఆచరణలోకి తీసుకువచ్చింది. ప్రిలిమినరీ నోటిఫికేషన్‌కే రాజపత్రం జారీ చేసిన సర్కారు… అభ్యంతరాల తర్వాత కూడా పెద్ద చెప్పుకోదగిన మార్పులే ఉండకపోవచ్చనే తెలుస్తోంది.
అదే గనుక జరిగితే ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలను ఎందుకు తీసుకున్నారనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలింది. కానీ బల్దియా ఉన్నతాధికారులు మాత్రం సర్కారు సూచనల మేరకే విభజన ప్రక్రియ పూర్తి చేశామని చెప్పుకోవడం… అధికారులపై సర్కారు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉన్నాయని తేలిపోయింది. దీంతో సర్కారుకు అందిన నివేదికకు అనుగుణంగా 300 వార్డులతో జీహెచ్ఎంసీ తుది ఉత్తర్వులను విడుదల చేయనున్నది.