కవాడిగూడ, ఆగస్టు 20: జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ విభాగంలో అధికారుల అనాలోచిత నిర్ణయాలతో నగరంలో ఎక్కడి చెత్త అక్కడ నిలిచిపోయిందని జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయిస్ అసోసియేసన్ జేఏసీ నాయకులు ఆరోపించారు. జేఏసీ కన్వీనర్ ఆకుల శ్రీనివాస్, అధ్యక్షుడు కె.బాలరాజు, వర్కింగ్ ప్రసిడెంట్ జహీర్, నాయకులు ఎం.నర్సయ్య, మెరుగు శ్రీనివాస్‌తో కలసి లోయర్ ట్యాంక్‌బండ్‌లోని డంపింగ్ యార్డ్‌ను బుధవారం సందర్శించారు. అక్కడ పేరుకుపోయిన చెత్తకుప్పలను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ విభాగంలో పనిచేస్తున్న డ్రైవర్లను అకారణంగా ఇతర విభాగాలకు బదిలీ చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయన్నారు.
అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్ అనాలోచిత నిర్ణయాల కారణంగానే జీహెచ్ఎంసీలో సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. రామ్కీ సంస్థకు జీహెచ్ఎంసీని దారాదత్తం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అందులో భాగంగానే ఈ చర్యలు అని మండిపడ్డారు. రాంకీలో పనిచేస్తున్న డ్రైవర్లు సమ్మె చేస్తున్న తరుణంలో జీహెచ్ఎంసీ వాహనాలను నిలిపివేయడం వెనుక ఉన్న కుట్రను ఉన్నతాధికారులు అర్థం చేసుకోవాలన్నారు.
సమస్యలను మరింత జఠిలం చేసి జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాలను ప్రైవేటుపరం చేయడానికి రఘుప్రసాద్ కుట్రలు చేస్తున్నాడని వారు ఆరోపించారు. రాంకీ సంస్థకు జీహెచ్ఎంసీలో టన్నుకు 1,800 రూపాయలు ఇస్తుండగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడిచే వాహనాలకు టన్నుకు 360 రూపాయలు ట్రాన్స్‌పోర్టేషన్ చార్జీలు చెల్లిస్తున్నారని తెలిపారు. పెద్ద మొత్తంలో ప్రైవేటు సంస్థలకు చెల్లింపులు చేస్తున్న వారి నుంచి జీహెచ్ఎంసీని రక్షించాలని ఉన్నతాధికారులకు వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ విభాగం ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ప్రవీణ్, బలవంత్‌రెడ్డి, వెంకటేస్, శ్రీనివాస్, ఆర్.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.