Hyderabad | బంజారాహిల్స్,ఏప్రిల్ 24: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అక్రమంగా నిర్మించిన భవనాన్ని జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. 200 గజాల స్థలంలో మూడు అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు తీసుకుని, ఏకంగా ఆరంతస్తులు నిర్మించినట్లు గుర్తించిన అధికారులు ఈ మేరకు చర్యలకు ఉపక్రమించారు.
వివరాల్లోకి వెళ్తే.. జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 11లో సర్వీ హోటల్‌కు సమీపంలో దీపక్ కుమార్ గుప్తా అనే వ్యాపారి 200 గజాల స్థలంలో ఏడాది క్రితం ఓ భవన నిర్మాణాన్ని చేపట్టాడు. జీహెచ్ఎంసీ నుంచి సిల్ట్ ప్లస్ 2 ఫ్లోర్లకు అనుమతి తీసుకున్న దీపక్ కుమార్ ఏకంగా ఆరంతస్తులు నిర్మించాడు. ఇది గమనించిన స్థానికులు అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీంతో దీపక్‌కుమార్‌కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ దీపక్‌కుమార్ స్పందించలేదు. తనకు అధికార పార్టీలోని ప్రజాప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తన జోలికివస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడు.
ఈ క్రమంలో స్థానికులు ఏకంగా జీహెచ్ఎసం కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ కమిషనర్ వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేసి, అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని నెల రోజుల క్రితం డీఎంసీ స్పీకర్ ప్రశాంతి స్పీకింగ్ ఆర్డర్ జారీ చేశారు. అయినప్పటికీ దీపక్ కుమార్ పట్టించుకోకపోవడంతో టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అక్రమంగా నిర్మించిన అదనపు అంతస్తులను పాక్షికంగా కూల్చివేశారు.