సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): మహానగరంలో దశాబ్దాల క్రితం నిర్మించిన పాత ైప్లెఓవర్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిలు(ఆర్యూబీ)లకు త్వరలోనే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టనున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, వంతెనలను నిర్మించిన సమయాన్ని పరిగణలోకి తీసుకొని వాటి పటిష్టతను శాస్త్రీయంగా పరీక్షించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది.
ఇందులో భాగంగా కొన్నేళ్ల క్రితం నిర్మించిన వంతెన ప్రస్తుత స్థితిగతులను అధ్యయనం చేసి అవసరమైన పునరుద్ధరణ చర్యలను సిఫార్సు చేసేందుకు అనుభవజ్ఞులైన కన్సల్టెంట్లను నియమించాలని అధికారులు భావిస్తున్నారు. ఒక సమగ్ర నివేదికను రూపొందించడానికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈఓఐ)ను జీహెచ్ఎంసీ ఆహ్వానించింది. 24 బ్రిడ్జిలను ఈ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు.
ఎంపిక చేసిన కన్సల్టెన్సీ సంస్థలు ఈ వంతెనల పిల్లర్లు, బేరింగులు, గిర్డర్లు, స్లాబ్‌ల నాణ్యతను పరిశీలించడానికి అత్యాధునిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్‌లో భాగంగా వంతెనలకు ఎలాంటి నష్టం కల్గకుండా లోపలి భాగాలను పరీక్షించేందుకు కనీసం 3550 పాయింట్ల వద్ద యూపీవీ(అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ) టెస్టింగ్, 790 పాయింట్ల వద్ద రిబౌండ్ హ్యామర్ టెస్టింగ్ నిర్వహించనున్నారు.