సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో వాణిజ్య సంస్థలు, వ్యాపారస్తులను జీహెచ్ఎంసీ టార్గెట్ చేసింది. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్‌కు సిద్ధమైంది. ప్రాపర్టీ ట్యాక్స్ డేటాబెస్ ఆధారంగా 317033 మంది కమర్షియల్ కేటగిరీలో ఆస్తిపన్ను చెల్లిస్తుండగా, వీరంతా ట్రేడ్ లైసెన్స్‌ల జాబితాలోకి రావాల్సి ఉంది. కానీ కేవలం లక్షా 9వేల 702 మంది మాత్రమే ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నట్లు అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలోనే ట్రేడ్ లైసెన్స్‌లు రెన్యువల్ చేసుకోని వారిపై బల్దియా దృష్టి సారించింది.
గ్రేటర్లో వ్యాపార సంస్థలకు జీహెచ్ఎంసీ జారీ చేసే ట్రేడ్ లైసెన్స్‌లకు సంబంధించిన జనవరి 31తో ఉచితంగా రెన్యువల్ చేసే గడువు ముగిసింది. ఫిబ్రవరి 1 నుంచి రెన్యువల్ చేసుకోనున్న ట్రేడ్ లైసెన్స్‌లపై ఫీజులో 25 శాతాన్ని పెనాల్టీ వేయనున్నారు. మార్చి ప్రారంభం నుంచి నెలాఖరు వరకు 50 శాతం జరిమానాగా వసూలు చేయనున్నారు. ఏప్రిల్ నుంచి రెన్యువల్ చేసుకునే వ్యాపారుల నుంచి చెల్లించాల్సిన ట్రేడ్ ఫీజులో వంద శాతం జరిమానా వసూలు చేయనున్నారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా 30 సర్కిళ్లలో ట్రేడ్ లైసెన్స్ లేని వారిని గుర్తించి వారి నుంచి ముక్కు పిండి ఫీజులు వసూలు చేయనున్నారు. మెడికల్ ఆఫీసర్, లైసెన్సింగ్ ఆఫీసర్ ప్రతి రోజూ కనీసం 20 వ్యాపార సంస్థలను నేరుగా కలిసి ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్‌కు చర్యలు చేపట్టనున్నారు.