GHMC | కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 5: మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా… అయితే వాటిని మా వాహనాల్లో వేస్తే.. వాటిని తీసుకెళ్లి అవసరమైన వారికి అందజేస్తామని జీహెచ్ఎంసీ కూకట్పల్లి సర్కిల్ అధికారులు చేపట్టిన వినూత్న ప్రచారానికి మంచి స్పందన వచ్చింది. కూకట్పల్లి జెడ్సీ అపూర్వ చౌహాన్, డీసీ గంగాధర్ ల పర్యవేక్షణలో శనివారం సర్కిల్ పరిధిలోని హైదర్ నగర్ డివిజన్లోని బృందావన్ కాలనీ, కూకట్పల్లి డివిజన్లోని వెంకట్రావు నగర్, ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని ఆర్ ఆర్ కాలనీ, బాలానగర్ డివిజన్ లోనీ బాలానగర్ లో ప్రత్యేక వాహనాలతో ఇంటింటికి తిరుగుతూ పనికిరాని వస్తువులను సేకరించారు.
ఇంట్లో పనికిరాని కుర్చీలు, టేబుల్స్, పరుపులు ఇతర వస్తువులు, దుస్తులను ప్రత్యేక వాహనాల్లో సేకరించారు. ఈ విషయమై సర్కిల్ ఎస్డబ్ల్యూఎం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇంట్లో పనికిరాని వస్తువులను తీసుకెళ్లి ఖాళీ ప్రదేశాలలో వేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని, వర్షం నీటి కాలువల్లో వేయడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి ముంపు సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇంటింటికి తిరిగి పనికిరాని వస్తువులను సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది పేర్కొన్నారు. ఈ సేకరించిన వస్తువుల్లో ఉపయోగపడే వాటిని అవసరమైన వ్యక్తులకు అందించడం జరుగుతుందని చెప్పారు. పూర్తిగా పనికిరాని వస్తువులు ఉంటే వాటిని డంపింగ్ యార్డ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఇదే తరహాలో అన్ని కాలనీలలో ప్రతి శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని.. ఆయా కాలనీ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.