సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ ప్రజావాణికి అర్జీదారుల నుంచి స్పందన కరువైంది. క్షేత్రస్థాయిలో పరిష్కారం కానివి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తే పరిష్కారం లభిస్తుందని ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జీహెచ్ఎంసీ ప్రదాన కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారుడికి చుక్కెదురవుతున్నది. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి వారం తూతూ మంత్రంగా నిర్వహిస్తుండడం, ఫిర్యాదు చేసిన పరిష్కారానికి నోచుకోకపోవడంతో అర్జీదారులు రావడం లేదు. గత వారం తరహాలోనే సోమవారం 43 ఫిర్యాదులు మాత్రమే అధికారులు స్వీకరించారు. ఈ ఫిర్యాదులను సైతం ఆంక్షల నడుమ ఫిర్యాదులను స్వీకరించారు.
నిర్భంధాలను దాటి అర్జీదారులు వెళ్లాల్సి వచ్చింది.. ముందుగా తన వెంట తెచ్చుకున్న సెల్‌ఫోన్, బ్యాగులు ముందు ఉన్న హోంగార్డు, సిబ్బందికి అందిస్తేనే వారి ఇచ్చిన టోకెన్ ద్వారా ప్రజావాణి కార్యక్రమంలోకి అనుమతి దక్కుతుంది. సమస్య తీవ్రత వివరించేందుకు సెల్‌ఫోన్‌ను అనుమతించాలని విజ్ఞప్తులు చేసినా.. అధికారులు పట్టించుకోకపోవడం లేదంటూ అర్జీదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను పరిశీలించి.. వెంట వెంటనే పరిష్కరించేలా చొరవ చూపాలని సంబంధిత అధికారులను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి నగరం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మేయర్, డిప్యూటీ మేయర్ విజ్ఞప్తులను స్వీకరించారు.