ఎర్లీ బర్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
ఎల్బీనగర్ జోన్‌లోని ఐదు సర్కిళ్ల టార్గెట్ రూ.79.34కోట్లు
ఏఎంసీలతో గూగుల్‌మీట్ సమావేశం నిర్వహించిన ఎల్బీనగర్ జడ్సీ పంకజ
ఎల్బీనగర్, ఏప్రిల్ 5: ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఎర్లీ బర్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆస్తిపన్నులు చెల్లించాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు. మార్చి31 వరకు ఆస్తిపన్ను బకాయీలపై దృష్టి సారించిన జీహెచ్ఎంసీ అధికారులు తాజాగా ప్రతియేటా మాదిరిగానే ఎర్టీ బర్డ్ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో రాబోయే సంవత్సరానికి గాను ముందస్తుగానే ఆస్తిపన్ను బకాయీలు చెల్లించే వారికి 5 శాతం రాయితీని ప్రకటించారు. ఈ క్రమంలో ఈ రాయితీ ఏప్రిల్ 30వ తేదీ వరకు వర్తిస్తుంది. అందులో భాగంగా ఎల్బీనగర్ జోన్ పరిధిలోని కాప్రా, ఉప్పల్, హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్ సర్కిళ్ల పరిధిలోని అసెస్మెంట్ దారులు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ సూచించారు.
ఎల్బీనగర్ జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో మొత్తం రూ.79.34కోట్లు లక్ష్యాంగా పెట్టుకుని వసూలు చేసేందుకు శ్రీకారం చుడుతున్నారు. జోన్‌లోని కాప్రా సర్కిల్‌కు రూ.15.99 కోట్లు, ఉప్పల్ సర్కిల్‌కు రూ.11.53కోట్లు, హయత్‌నగర్ సర్కిల్లో రూ.18.85కోట్లు, ఎల్బీనగర్ సర్కిల్‌కు రూ.14.55కోట్లు, సరూర్‌నగర్ సర్కిల్లో రూ.18.43కోట్లు లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు ఎర్లీబర్డ్ పథకంలో ఇప్పటి వరకు కాప్రా సర్కిల్లో రూ.54 లక్షలు, ఉప్పల్ సర్కిల్లో రూ.29లక్షలు, హయత్‌నగర్ సర్కిల్లో రూ.61లక్షలు, ఎల్బీనగర్ సర్కిల్ రూ.34 లక్షలు, సరూర్‌నగర్ సర్కిల్లో రూ.58 లక్షలు జోన్ వ్యాప్తంగా మొత్తం రూ.2.36కోట్లు వసూలయ్యాయి. ఈ నెల చివరి నాటికి రూ.76.98 కోట్లు వసూలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.
గూగుల్ మీట్లో సమీక్ష..
ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఎర్లీ బర్డ్ పథకం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ సూచించారు. ఈ మేరకు గూగుల్ మీట్ ద్వారా ఎల్బీనగర్ జోన్‌లోని ఐదు సర్కిళ్ల ఏఎంసీ (అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్)లతో సమీక్ష నిర్వహించారు. ఆస్తిపన్ను బకాయీలను వసూలు చేయడంతో ఉత్తమంగా పనిచేసినందుకు సిబ్బందిని అభినందించారు. అదే విధంగా ఎర్టీ బర్డ్ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. రెవెన్యూ సిబ్బంది కూడా ఎర్లీ బర్డ్ పథకాన్ని అసెస్మెంట్ దారులకు వివరించి పన్నుల వసూళ్లకు సిబ్బందితో కలిసి పనిచేసి లక్ష్యాలను సాధించాలని సూచించారు.