సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ ): జీహెచ్ఎంసీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) సర్వే మూడు అడుగులు ముందుకు-ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నది. జూన్ 2024లో నియో జియో ఇన్ఫో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బాధ్యతలు అప్పగించగా, తొలుత ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే నెలతో రెండేండ్లు కావొస్తున్నా.. తుది దశకు చేరుకోలేదు. సాంకేతిక అధారంగా 80 శాతం ఆస్తుల సర్వే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నా.. క్వాలిటీ చెక్ సగం కూడా జరగకపోవడం గమనార్హం. చార్మినార్ జోన్లో అత్యల్పంగా 46 శాతం, గోల్కొండ జోన్ల 66 శాతం సర్వే జరిగింది. రెండు దఫాలుగా పెంచిన గడువు దృష్ట్యా మొత్తంగా 18 నెలల్లో సర్వే పూర్తి చేయాలని ప్రతి నెల నిర్ణీత మొత్తం సర్వే చేయని పక్షంలో పెనాల్టీ వేస్తామని ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇందులో భాగంగానే సర్వేలో జాప్యం జరిగినందుకు సదరు ఏజెన్సీకి జీహెచ్ఎంసీ రూ. 54 లక్షల జరిమానా విధించింది. సంస్థ చెల్లింపుల్లో ఆ మొత్తాన్ని మినహాయిస్తున్నట్లు ఆర్థిక విభాగం అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రూ. 8 కోట్ల వరకు చెల్లింపులు జరపడంతో పాటు మరో కొన్ని నెలల పాటు గడువు పెంచడం గమనార్హం.
జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే ప్రక్రియ ప్రారంభించి వచ్చే నెలతో రెండేళ్లు పూర్తవుతుంది. ఈ జీఐఎస్ సర్వేకు జీహెచ్ఎంసీ దాదాపు రూ. 22 కోట్ల మేర ఖర్చు చేస్తున్నది. గ్రేటర్ పరిధిలో ప్రతి ఆస్తిని, నిర్మాణాన్ని, ఖాళీ ప్లాట్లను, నివాసాలను, వ్యాపార భవనాలను గుర్తించి మ్యాపింగ్ చేసేందుకు గరిష్టంగా 18 నెలల గడువు తీసుకుని 19.81 లక్షల ఆస్తులను గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. పన్ను పరిధిలోకి రాని ఆస్తులు మరో 3 లక్షలకు పైగా ఉంటాయని పేర్కొన్నారు. మొత్తంగా 23 లక్షల ఆస్తుల వివరాల సర్వే చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 17.88 లక్షల ఆస్తుల జీఐఎస్ సర్వే పూర్తయినట్లు తెలిసింది. మరికొన్ని నెలలు గడువు పొడగించాలని సదరు ఏజెన్సీ జీహెచ్ఎంసీకి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం 200 మంది నిత్యం 2వేల ఆస్తుల సర్వే నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని చెబుతున్నా.. గడువులోగా ముగించడం కష్టమే అన్న చర్చ జరుగుతున్నది. కాగా, సర్వేలో భాగంగా కాగా ముంబై తరహాలో ప్రతి ఇంటికి 11 అంకెలతో కూడిన యూనిక్ ఐడీతో పాటు క్యూఆర్ కోడ్ అందించనున్నారు. స్టీట్, వార్డు, సర్కిల్, అసెంబ్లీ కోడ్లను గుర్తించేలా ప్రతి ఇంటికీ ఓ బోర్డును కేటాయించనున్నారు. దాని ఆధారంగా అన్ని సేవలు అందించనున్నారు. ఈ యూనిక్ నంబర్‌తో క్యాబ్ బుక్ చేసినా, ఫుడ్, వస్తువులతో పాటు ఆన్లైన్లో ఏది బుక్ చేసినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంటికే డెలివరీ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.