ఎల్బీనగర్/మన్సూరాబాద్, జూలై 25: ఒకవైపు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రజా జీవితానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జీహెచ్ఎంసీ అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. వరదముంపు ప్రాంతాలను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అర్ధరాత్రి సమయంలో వివేకానందనగర్ ప్రాంతాన్ని సందర్శించి అధికారులకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదే విధంగా ఉదయం సమయంలో ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డితో పాటు సిబ్బంది వివేకానందనగర్ ప్రాంతాన్ని సందర్శించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు, చింతలకుంటలోని రెయిన్బో దవాఖాన వద్ద, పనామా, సుష్మ తదితర ప్రాంతాల్లో ఏర్పడిన గుంతలమయంగా మారాయి. పలు ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా మారిన రోడ్ల విషయాన్ని తెలుసుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది మంగళవారం సదరు గుంతలను పూడ్చటం చేపట్టింది.
బైరామల్‌గూడ చెరువు నుంచి సరూర్‌నగర్ చెరువు వెళ్లే మార్గంలో బైరామల్‌గూడ గ్రామంలో వరదనీరు నివాసాల్లోకి చేరడంతో జేసీబీ యంత్రం సహాయంతో నాలా పైకప్పును తొలగించి నీటిని సాఫీగా నాలాల్లోకి మల్లించి ముంపు సమస్య నుంచి గట్టెక్కించారు. చిత్తడిగా మారిన ప్రాంతాల్లో జేసీబీలతో మట్టిని పోసి చదును చేశారు. రోడ్లపై పడిన గుంతల్లో పడి ప్రజలు ప్రమాదాల బారినపడకుండా జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలపై వాహనదారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దీంతో పాటు లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరకుండా చర్యలు చేపట్టారు. అదేవిధంగా కాలనీలు, ప్రధాన రహదారుల్లో ఉన్న నాలాలు, మ్యాన్‌హోళ్లలో పేరుకుపోయిన చెత్త, చెదారాన్ని తొలగించి వరదనీరు సక్రమంగా దిగువకు వెళ్లేలా చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని తెలిపారు. కాలనీల్లో ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాలను ముట్టుకోవడం లాంటి చర్యలకు పాల్పడవద్దని కోరారు.