నాలాలు, చెరువుల పరిసరాల్లోకి వెళ్లొద్దు
రక్షణ గోడలు, జాలీలు తొలగించకండి
వరద ప్రాంతాల్లో సాహసాలు వద్దు
నగరపౌరులకు జీహెచ్ఎంసీ సంక్షిప్త సందేశాలు
వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల పర్యటన
దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు
తాగునీటి నాణ్యతపై జలమండలి పరీక్షలు
సిటీబ్యూరో, జూలై 13 (నమస్తేతెలంగాణ) : గ్రేటర్‌వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో సాధారణ జనజీవనం స్తంభించిపోతున్నది. నాలాల్లో వరద పొంగుతుండగా, చెరువులు పూర్తిగా నిండి అలుగుపారుతున్నాయి. చెరువుల ఎగువ ప్రాంతాలు, లోతట్టు ప్రదేశాలు ముంపునకు గురికాకుండా బల్దియా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. వచ్చిన వరద వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. నాలాలు, కాల్వల పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూనే, అవసరమైన చోట్ల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. చెరువులు, నాలాల వద్దకు వెళ్లొద్దని, సాహసాలు చేసి నిండుజీవితాన్ని బలి చేసుకోవద్దని జీహెచ్ఎంసీ సూచించింది. ‘మనిషి జీవితం చాలా విలువైనది.. దయచేసి అప్రమత్తతతో ఉండండి’ అంటూ నగరపౌరులకు సంక్షిప్త సందేశాలు పంపుతోంది. వరద ప్రవాహానికి ఆటంకం కలిగించొద్దని, నాలాల రక్షణ గోడలు, జాలీలు తొలగించొద్దని బుధవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. 5రోజులుగా విజృంభించిన వరుణుడు కాస్త శాంతించాడు. నగరంలో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమై ఉండగా, తీవ్రమైన చలిగాలులతో జనం గజగజ వణికిపోతున్నారు.
మ్యాన్‌హోల్ తెరిస్తే క్రిమినల్ కేసు
భారీవర్షాల నేపథ్యంలో మురుగునీటి మ్యాన్‌హోళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవద్దని, అనుమతి లేకుండా తెరిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి ఎండీ దానకిశోర్ హెచ్చరించారు. మ్యాన్‌హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉన్నట్లు కనిపిస్తే వెంటనే జలమండలి కస్టమర్ కేర్ 155313కు సమాచారమివ్వాలన్నారు.
జంటజలాశయాలకు స్వల్ప వరద
ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో జంటజలాశయాలకు వరద స్వల్పంగా తగ్గింది. ఇప్పటికే రెండు రిజర్వాయర్లలో నాలుగు గేట్లెత్తి నీటిని మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో తగ్గడంతో గురువారం ఉదయం గేట్లు మూసివేసే అవకాశముంది.
ముసురుతున్న సీజనల్ వ్యాధులు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, చలిగాలులతో నగరంలో సాధారణ జ్వరం, డెంగ్యూ, దగ్గు, జలుబు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 516 డెంగ్యూ కేసులు నమోదవడంతో వైద్యాధికారులు ఫీవర్ సర్వే ప్రారంభించారు. బుధవారం ఒక్కరోజే 104 ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు.
లంగర్‌హౌస్ మొఘల్‌కా నాలాలో పడిపోయిన వృద్ధుడిని రక్షిస్తున్న అగ్నిమాపక సిబ్బంది