GHMC | మియాపూర్, మే 17: శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని రెండు భవనాలను తక్షణమే నేలమట్టం చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు తగు చర్యలు తీసుకోవాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.
చందానగర్ సర్కిల్లో జాతీయ రహదారి వెంట ఉన్న ఒక భవనంలో వారం క్రితం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పక్క భవనానికి కూడా మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఈ రెండు భవనాల్లో మంటలను పూర్తిగా ఆపేందుకు అగ్నిమాపక సిబ్బంది రెండు రోజుల పాటు శ్రమించారు. ఇదే వాణిజ్య భవనంలో 2016లో మంటలు అంటుకుని అప్పుడు కూడా భవనం పూర్తిగా తగలబడింది. ఇప్పుడు మరోసారి అగ్ని ప్రమాదం జరగడంతో స్లాబ్‌తో పాటు పిల్లర్లు, గోడలు సైతం దెబ్బతిని వాటి సామర్థ్యం తగ్గినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో ఈ భవనాలతో భవిష్యత్తులో కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించిన అధికారులు.. ఆ రెండు భవనాల కూల్చివేతకు జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశించారు. వీలైనంత తొందరగా సదరు భవనాలను నేలమట్టం చేయాలని సూచించారు. జోనల్ అధికారుల సూచన మేరకు జీహెచ్ఎంసీ సిబ్బంది సదరు భవనాలకు నోటీసులు అంటించారు. మరోపక్క ఈ భవనాల అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ అంశాలపై ఇప్పటికే అంతర్గత విచారణను అధికారులు చేపట్టారు.