సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ ) : ప్రజా పాలన ప్రభుత్వమని చెబుతున్న కాంగ్రెస్ సర్కారులో ప్రజల కష్టాలు పెరిగాయి.. శాఖల మధ్య సమన్వయ లోపంతో రోడ్డెక్కితే చాలు సమస్యలు స్వాగతం పలకడమే కాదు…ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా డెంగీ, మలేరియా వ్యాధులు, వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నా.. పారిశుధ్య నిర్వహణలో అధికారులు నిద్ర మత్తు వీడడం లేదు. ఎక్కడ చూసినా.. చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి.
ఈ క్రమంలోనే చెత్తా చెదారంలో దోమలు నివాసాలుగా ఏర్పర్చుకొని జనంపై దాడి చేస్తున్నాయి. వాటి బారిన పడిన జనం జ్వరాలతో దవాఖానల్లో చేరుతున్నారు. ఉస్మానియా, ఫీవర్, గాంధీ దవాఖానల్లో సాధారణ రోజుల కంటే దాదాపు 300 మంది ఒక్కో ఆసుపత్రుల్లో ఓపీల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం. ప్రైవేట్ క్లినిక్‌లలోనూ ఓపీల తాకిడి పెరగడం గమనార్హం. పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని జీహెచ్ఎంసీ ఒకవైపు ప్రకటనలు జారీ చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కాలనీలు, రహదారుల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి.
ఎక్కడ చూసినా.. చెత్త కుప్పలే
తరచూ చెత్త వేసే ప్రాంతాలు (గార్భే వనరేబుల్ పాయింట్లు/జీవీపీ) జీహెచ్ఎంసీ పరిధిలో 2,640 ప్రాంతాలను గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారే తప్ప.. క్షేత్రస్థాయిలో వీటికి అదనంగా కొత్తగా జీవీపీ పాయింట్లు పుట్టుకొస్తున్నాయి. స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ సరిగా జరగడం లేదు.
ఇటీవల పారిశుధ్య కార్మికులు రెండు రోజుల పాటు సమ్మెలోకి వెళ్లడం ఈ ప్రభావం మరింత పడింది. వాస్తవంగా వర్షాకాలంలో వ్యర్థాలు త్వరగా కుళ్లి దుర్గంధం వెదజల్లే పరిస్థితులు ఎక్కువ. దీని చక్కదిద్దేందుకు , చెత్తను ఎప్పటికప్పుడు తరలించేందుకు వర్షాకాలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదు. వర్షాలొస్తే దోమలు, ఈగలు, క్రిమికీటకాలు వృద్ధి చెంది రోగాలు వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే మలేరియా, డెంగీ కేసులు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో పారిశుధ్య నిర్వహణకు మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.
ప్రజల ప్రాణాలు కాపాడండి..సీపీఐ(ఎంఎల్)
పారిశుధ్యానికి నిధులు కేటాయించి ప్రజల ప్రాణాలు కాపాడాలని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ విజ్ఞప్తి చేసింది. దోమలకు నిలయంగా మారుతున్న చెత్తను తొలగించాలని, సీజనల్ వ్యాధులను అరికట్టాలని, డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్స్‌తో ప్రజల ఆర్థిక, ప్రాణ నష్టం కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు సిటీ కమిటీ ఆందోళన చేపట్టింది.
వరుసగా కురుస్తున్న వర్షాలతో డ్రైనేజీలు, కాలువలు నిండిపోవడం, అపరిశుభ్ర వాతావరణం ఏర్పడడం, దోమ లార్వా దశలో చంపకపోతే అవి ప్రజలను డెంగీతో ప్రాణాల మీదకు తెస్తుందని నాయకులు హన్మేశ్, ప్రదీప్, రవికుమార్ ఆరోపించారు. గాంధీ, ఉస్మానియా, కోఠి తదితర బస్తీ దవాఖానలు రోగులతో నిండిపోయాయని పేర్కొన్నారు. అనంతరం పారిశుధ్య విభాగం అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్‌ను కలిసి నాయకులు వినతిపత్రం సమర్పించారు.
కాగితాల్లోనే స్పెషల్ డ్రైవ్
ప్రజారోగ్యమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ను కంటి తుడుపు చర్యగానే ముగించారు. 150 వార్డులలో వర్షాకాలం ప్రత్యేక పారిశుధ్య కార్యమ్రానికి గత నెల 29 నుంచి ఈ నెల 8 వరకు శ్రీకారం చుట్టారు. కమిషనర్ నుంచి కార్మికుడి వరకూ ‘పరిశుభ్ర హైదరాబాద్’ లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తారని, ప్రతి రోజూ నిత్యం శానిటేషన్ కార్యక్రమాల తర్వాత రోజు ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ పరిశుభ్రతా చర్యలు చేపడుతున్నట్లు కార్యక్రమం మొదటి నాలుగు రోజుల్లో హడావుడి చేశారు.
అయితే కార్యక్రమం చివరి మూడు రోజుల్లో స్పెషల్ డ్రైవ్‌ను చాలా చోట్ల చేపట్టలేదు. వర్షాల కారణంతో చేతులెత్తేశారు. ప్రస్తుతం గురువారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ఐదు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ అంటూ ప్రకటించారు. కానీ ఎక్కడ శుభ్రత పాటించలేదని క్షేత్రస్థాయి పరిస్థితులు అద్దం పడుతున్నాయి. కాగా 11 రోజుల పాటు పారిశుధ్య జరిపిన స్పెషల్ డ్రైవ్‌లో 82 చోట్ల డెంగీ కేసులను గుర్తించడం గమనార్హం.
2640 చోట్ల చెత్త కుప్పలు
పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, వ్యాధుల నివారణకు ఏటా రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నా..లక్ష్యాన్ని మాత్రం సాధించలేకపోతున్నారు. చెత్త డబ్బాలను ఎత్తి వేయగా..ఇప్పటికీ 2640 చోట్ల చెత్త కుప్పలున్నట్లు ఆస్కి ఇటీవల నిర్వహించిన సర్వేలో తేల్చడమే అధికారుల పనితీరును ప్రశ్నిస్తోంది. ఎక్కడా చూసినా పెద్ద పెద్ద చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి.
వ్యర్థాలతో నిండిపోయినా బస్తీలు, కాలనీలు వెరసి దోమలతో దవాఖానల్లో పెరుగుతున్న వ్యాధి పీడితులతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీనికి కారణం అడుగడుగునా కొందరి అధికారుల అవినీతి లెక్కలు, రికార్డుల్లో తప్ప క్షేత్రస్థాయిలో కనిపించని సిబ్బంది..కాగితాల్లో మాత్రమే కనిపించే చెత్త తరలింపు..మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ మొదలుకొని డిప్యూటీ కమిషన్ల వరకు ఆకస్మిక పర్యటనల లేమి వరకు లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఒక్క వీఐపీలు ఉండే ప్రాంతాలు, ప్రధాన రహదారుల్లో మాత్రమే పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా కనిపిస్తుందే తప్ప.. కాలనీలు, బస్తీలలో చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి.