Manikonda | మణికొండ, ఏప్రిల్ 23 : ‘గుడ్ మార్నింగ్ మణికొండ’ పేరుతో హైదరాబాద్‌లోని మణికొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణను కొద్దిరోజులుగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం నాడు శ్రీరామ్‌నగర్ సెక్రటేరియట్ కాలనీలో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను బీఆర్ఎస్ నాయకులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో పనులు చేయడం కంటే.. పన్నులు వసూలు చేయడమే ఎక్కువగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. స్థానికులు చెప్పిన సమస్యలు విన్న మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ.. సంబంధిత అధికారులతో సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రధాన సమస్యలు:
1. పందెం వాగు నాలాలో చెత్తాచెదారం తీసేయకపోవడం వల్ల మురుగునీటి పారుదల సక్రమంగా ఉండటం లేదు. మురుగు నీటి ప్రవాహం లేకపోవడం వల్ల భరించలేని కంపు వాసనతో పాటు దోమల బెడద ఎక్కువైందని స్థానికులు తెలిపారు.
2. పందెం వాగు పక్కనే పార్కుకు నిర్దేశించిన ప్రాంతమంతా చెత్తా చెదారంతో నిండిపోయింది. ఒక ప్రక్క ప్రభుత్వ స్థలాలు లేవని చెబుతూనే ఉన్న ప్రభుత్వ స్థలాలను కాపాడుకోవడంలో మున్సిపల్ అధికారులు విఫలమవుతున్నారని మండిపడ్డారు. పందెం వాగు పరివాహక ప్రాంతమంతా అన్యాక్రాంతం అవుతున్నదని వాపోయారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు సత్వరమే స్పందించి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
3. వీధి కుక్కల బెడద ఎక్కువైంది.. ఈ సమస్యను తగ్గించేందుకు శునకాలకు వ్యాక్సినేషన్‌తో పాటు పునరుత్పత్తి జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
4. కొత్తగా రోడ్డు వేసిన ప్రాంతంలో కనీస సాంకేతిక పద్ధతులు అవలంబించని కారణంగా డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ గుంతలుగా ఏర్పడ్డాయని తెలిపారు.
5. వీధి దీపాలు తరచూ పాడైపోతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇంటి పన్ను వసూలు చేసేటప్పుడు ముక్కు పిండి జీహెచ్ఎంసీ కన్నా మూడింతల ఎక్కువ వసూలు చేస్తున్నారని, ప్రజా సౌకర్యాలకు వచ్చేప్పటికీ జవాబుదారీతనం కొరవడిందని మండిపడ్డారు.