సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : డిప్యూటీ కమిషనర్ల బదిలీల్లో కొన్ని ‘ముఖ్య’నేత అనుచరుల కనుసైగల్లో జరిగాయన్న చర్చ మరువ ముందే టౌన్ ప్లానింగ్ పోస్టింగ్‌లపై కన్నేసినట్లు జీహెచ్ఎంసీ అధికార వర్గాల్లో ప్రస్తుతం హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్నది. వచ్చే రెండు రోజుల్లోగా 60 సర్కిళ్లకుగానూ ఏసీపీల నియామకానికి కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో పైరవీల జాతర తెరమీదకు వచ్చినట్లు చర్చ జరుగుతున్నది. కొత్తగా ఏర్పాటైన జోన్లలో తిష్ట వేసేందుకు ‘అక్షయపాత్ర’ వంటి సర్కిళ్లలో పోస్టింగ్‌ల కోసం కొంద రు ఏసీపీలు తమకున్న రాజకీయ బలబలాలను ప్రదర్శించి ఎలాగైనా కోరుకున్న సీటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారన్నది ప్లానింగ్ విభాగంలో చర్చ జరుగుతున్నది.
నార్సింగి, దుండిగల్, మాదాపూర్, బోడుప్పల్, అల్వాల్, నిజాంపేట,కొంపల్లి , ఘట్కేసర్ లాంటి శివారు సర్కిళ్లలో అత్యధికంగా నిర్మాణాలు వస్తుండడంతో ‘ కమిషన్ల’ పంట పండుతుందని ఆశావహులు లెక్కలు వేసుకుని మరీ కొత్త పోస్టింగ్‌లపై ఒత్తిడి తెచ్చేందుకు సన్నద్ధమయ్యారని వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా కొత్తగా ఏర్పడిన జోన్లు, సర్కిళ్లలో భారీగా ఏసీపీ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 72 మంది ఏసీపీలు అవసరం ఉండగా, కేవలం దాదాపు 35 మంది మాత్రమే ఉన్నారు.
ఇప్పటికే అక్రమ నిర్మాణాల నియంత్రణ, న్యాయపరమైన కేసులు, నోటీసులు, క్షేత్రస్థాయి పర్యటనలు, అనుమతులు, భూ సేకరణ, సమావేశాలతో పనిభారంతో టౌన్ ప్లానింగ్ విభాగం సతమతమవుతున్నది. అయితే కొత్తగా ఏర్పడిన 30 సర్కిళ్లు, ఆరు జోన్లలో సీపీలు, ఏసీపీల నియామకం చేయాల్సి ఉంది. ఇప్పుడున్న ఏసీపీలకు రెండు సర్కిళ్లతో అదనపు బాధ్యతలు మోయక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏసీపీ స్థానాల భర్తీకి యమ డిమాండ్ ఉండడంతో కోరుకున్న సర్కిల్‌ను ఎలాగైనా దక్కించుకునేందుకు సిద్ధమవుతుండడం, ఇందుకు ‘ముఖ్య’నేత అనుచరుడు ఇప్పటికే రంగంలోకి దిగడం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొత్తంగా ఈ నెల 29న ఏసీపీలు పెద్ద ఎత్తున బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి. పారదర్శకంగా బదిలీలు జరుగుతాయా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే..!!