బంజారాహిల్స్, జూన్ 3: మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు జన్మదినం సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌తో పాటు పార్టీ నేతలు, అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మంగళవారం జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించడం వివాదాన్ని రాజేసింది. సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంతో పాటు మంగళవారం ఎమ్మెల్యే హరీష్‌రావు జన్మదినం కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తెలంగాణ భవన్ చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా మంగళవారం ఉదయాన్నే జీహెచ్ఎంసీ సిబ్బంది తెలంగాణ భవన్ వద్దకు చేరుకుని ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు తొలగించారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను వారం రోజులు గడిచినా తొలగించని జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫ్లెక్సీలను పుట్టిన రోజు నాడే తొలగించడం సిగ్గుచేటు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందించారు. ఇదిలా ఉండగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వద్ద ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే హరీష్‌రావు ఫ్లెక్సీలను తొలగించిన జీహెచ్ఎంసీ సిబ్బంది పక్కనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ బయట రోడ్డు మీద ఏర్పాటు చేసిన మహానాడు ఫ్లెక్సీ తొలగించకపోవడం గమనార్హం. మహానాడు పూర్తయి ఆరు రోజులు గడిచినా టీడీపీ నేతల ఫ్లెక్సీల జోలికి వెళ్లని ప్రభుత్వం ఓర్వలేని తనంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఫ్లెక్సీలు తొలగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.