నాంపల్లి క్రిమినల్ కోర్టులు, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): 2013లో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన జలగం వెంకటేశ్వరరావుకు ఏడాది జైలుశిక్షతో పాటు రూ.20వేల జరిమానా విధిస్తూ నాంపల్లిలోని ఏసీబీ కోర్టు జడ్జీ శుక్రవారం తీర్పు వెల్లడించారు. మ్యుటేషన్ పేరు మార్పుకోసం లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం నిందితుడిని పట్టుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన తర్వాత కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేశారు.
ప్రస్తుతం రాజేంద్రనగర్ సర్కిల్-4లో సీనియర్ అసిస్టెంట్‌గా వెంకటేశ్వరరావు పనిచేస్తున్నాడు. గతంలో జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న సమయంలో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు అదుపులోకి తీసుకుని సేకరించిన సాక్ష్యాధారాల్ని కోర్టుకు సమర్పించారు. సుదీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు నిందితుడిపై నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేసింది. ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకునేందుకు నిందితుడికి సమయాన్ని ఇస్తూ కోర్టు తీర్పులో పేర్కొంది.