సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ ) : చెరువుల రక్షణలోనే కాదు…సుందరీకరణ పనుల్లోనూ జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వహిస్తోంది. చెరువుల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా విభాగాన్ని ఏర్పాటు చేశామని ఒక వైపు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో చెరువుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేక కబ్జాదారులకు అధికారులు వంత పాడుతున్నారు. చేతిలో ఉన్న నిధులతో పరిరక్షణ, సుందరీకరణ పనులు చేపట్టి మినీ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అధికారులు.. గడిచిన ఏడాది కాలంగా పనులపై పురోగతి చూపించడం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 185 చెరువుల కాపాడి పరిసరాలను అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాల్సిన జీహెచ్ఎంసీ సుందరీకరణ పనులను అటకెక్కించింది.
చుట్టూ బండ్, వాకింగ్ ట్రాక్లు, ల్యాండ్ స్క్రేపింగ్ పనులు నత్తనడకగా సాగుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి మురుగు నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో దుర్వాసనతో స్థానికులు అవస్థలుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చెరువు సుందరీకరణ పనులు నిలిచిపోవడంపై బల్దియాకు ఫిర్యాదులు వెలువెత్తాయి. జీహెచ్ఎంసీ పరిధిలో తొలి విడతగా 20 చెరువులను గత కేసీఆర్ ప్రభుత్వం సుందరీకరణ పనులను రూ. 271.33 కోట్లతో చేపట్టింది. అయితే కొత్త ప్రభుత్వం వచ్చాక చెరువుల సుందరీకరణ పనులు ఏ మాత్రం ముందుకు కదలడం లేదు. రూ. 60.86కోట్లతో 34 చోట్ల చేపట్టిన పనుల్లో పెద్దగా పురోగతి లేకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం.