సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ) : నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉన్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. నగరవాసుల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిషారంపై ఆరా తీశారు. వర్షాలతో నగర వాసులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జీహెచ్ఎంసీ ద్వారా ఏర్పాటు చేసిన 428 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలతో అధికారులు క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండి, చర్యలు చేపడుతున్నట్లు మేయర్ తెలిపారు. 428 బృందాలతో పాటు 27 డీఆర్ఎఫ్ సిబ్బంది 24 గంటల పాటు కష్టపడి ప్రజలకు ఇబ్బందులు లేకుండా విశేష కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైన పనులు ఉంటేనే బయటకు రావాలని మేయర్ కోరారు. మొత్తం 946 నీటి నిల్వలపై వచ్చిన ఫిర్యాదులు పరిషారమయ్యాయని, 107 చోట్ల కూలిన చెట్లను తొలగించినట్లు చెప్పారు.
శిథిల భవనాల కూల్చివేత
నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు కృషి చేశారని మేయర్ చెప్పారు. ఇప్పటి వరకు 483 గృహాలను గుర్తించగా, అందులో 87 ఇండ్లను కూల్చినట్లు చెప్పారు. గృహ యజమానులు కోరిక మేరకు 92 వాటికి మరమ్మతులు జరిపామని, 135 గృహాల నుంచి ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు. అలాగే 19 గృహాలు సీజ్ చేసినట్లు మేయర్ తెలిపారు. నగర పరిధిలో ఎస్ఎన్డీపీ ద్వారా రూ.780 కోట్ల వ్యయంతో 36 పనులు చేపట్టగా, అందులో 30 పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఎస్ఎన్డీపీ పూర్తయిన ప్రాంతాల్లో ఎలాంటి వరద ముప్పు లేకుండా పోయిందని, మిగతా 6 నాలా అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. గతంలో కొన్ని లోతట్టు ప్రాంతాలు ఎప్పుడూ జలమయమయ్యేవని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రజల సమస్యల పరిషారానికి కంట్రోల్ రూమ్ 24 గంటల పాటు పనిచేస్తున్నట్లు తెలిపారు.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి
భారీ వర్షాల దృష్ట్యా పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కమిషనర్ రోనాల్డ్‌రోస్‌కు సూచించారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో పలు అంశాలపై కమిషనర్‌తో చర్చించారు. వర్షాకాలంలో డెంగీ కేసులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, నివారణకు ముందు జాగ్రత్తలపై పూర్తి అవగాహన కల్పించే ఐఈసీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. మురికివాడల్లో ఎక్కువ దృష్టి సారించాలని పేర్కొన్నారు.
వర్షసూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఆవర్తన ప్రభావంతో శనివారం గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయని, రాత్రి 10 గంటల వరకు టోలిచౌకి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి బాలాజీనగర్‌లలో 1 సెం.మీటర్ల వర్షం పడినట్లు తెలిపారు. గరిష్ఠం 27.5, కనిష్ఠం 22.7 డిగ్రీల ఉష్ణోగ్రత, గాలిలో తేమ 82 శాతంగా నమోదైనట్లు వివరించారు.