గ్రేటర్లో నాలా పూడికతీత పనులపై జీహెచ్ఎంసీ అలసత్వం ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది వర్షాకాలం ముందస్తుగా వస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడం, వర్షాలు కురుస్తున్నప్పటికీ పనులను వేగం పెంచడంలో మీనమేషాలు లెక్కిస్తున్నది. వాస్తవంగా గత డిసెంబర్ నెలలో నాలా పనులకు టెండర్లు ముగించాల్సిన అధికారులు.. గత నెల మొదటి వారం వరకు కొన్ని చోట్ల టెండర్లతోనే కాలాయాపన చేసింది.
ఇప్పటి వరకు నాలా పూడికతీత పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ 60 శాతం కూడా పూర్తి చేసుకోకపోవడం అధికారుల పనితీరుకు అర్థం పడుతున్నది. ఈ ఏడాది రూ. 55.04 కోట్లతో 203 చోట్ల పనులకు 951.71 కిలోమీటర్ల పొడవున పూడికతీత చేపట్టాల్సిన ఉండగా, ఇప్పటి వరకు 518 కిలోమీటర్ల మేర మాత్రమే పూర్తి చేయడం గమనార్హం. – సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ )
ప్రతి ఏడాది దాదాపు రూ.55 కోట్ల మేర నాలా పూడికతీత పనులకు టెండర్లు పిలిచి వర్షాకాలం తొలకరి జల్లులు కురిసే నాటికల్లా పనులను పూర్తి చేసి వరద నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు చేపట్టాలి. కానీ జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ నిర్వహణ విభాగం మీనమేషాలు లెక్కిస్తున్నది. నేటికి 100 శాతం పనులను పూర్తి చేయలేదు. అంతేకాకుండా వానాకాలంలో పలు ప్రాంతాలు, కాలనీలు నీట మునుగుతున్నా జీహెచ్ఎంసీ గుణపాఠం నేర్వడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.
కిర్లోస్కర్ కమిటీ స్టడీ చేసిన పలు సిఫారస్సులను కూడా అమలు చేయడంలో విఫలమవుతుందన్న విమర్శలున్నాయి. అప్పట్లో వరదల నివారణ కోసం కిర్లోస్కర్ కమిటీ చేసిన సిఫార్సులను బుట్టదాఖలు చేస్తూ కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు తమ బినామీ సంస్థలకు పనులను అప్పగిస్తూ తుతూ మత్రంగా చేపడుతూ ఏటా ఏటా పూడిక పేరిట కోట్లాది రూపాయలు జేబులు నింపుకొంటున్నట్లు ఆరోపణలున్నాయి.
వీటిలో రూ.55.04 కోట్లతో 203 చోట్ల పనులకుగానూ 951.71 కిలోమీటర్ల పొడవున పూడికతీత చేపట్టాల్సిన ఉండగా, ఇప్పటి వరకు 518 కిలోమీటర్ల మేర మాత్రమే పూర్తి చేయడం గమనార్హం.