సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేసిన కాంగ్రెస్ సర్కారు.. అందుకు అనుగుణంగా తదుపరి చర్యలను వేగవంతం చేసింది. ఈ మేరకు బుదవారం 27 విలీనం పట్టణ స్థానిక సంస్థలతో కలిసి జీహెచ్ఎంసీని ఇకపై తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌గా గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థలను మున్సిపల్ యాక్ట్ నుంచి తొలగించి జీహెచ్ఎంసీ యాక్ట్‌లోకి తీసుకువచ్చారు.
ఈ క్రమంలోనే విలీన పట్టణ స్థానిక సంస్థలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. అంతేకాకుండా విలీన మున్సిపాలిటీల రికార్డుల బదిలీకి ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఈ నెల 5వ తేదీలోగా రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని, అన్ని కార్యాలయాలపై జీహెచ్ఎంసీ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. వీటితో పాటు పట్టణ స్థానిక సంస్థల విలీన ప్రక్రియ ముగిసే వరకు 27 యూఎల్బీలు 27 జీహెచ్ఎంసీ సరిళ్లుగా పరిగణిస్తున్నట్లు, ప్రస్తుతం ఆయా సంస్థల్లో ఉన్న సిబ్బంది ద్వారానే పరిపాలన వ్యవహారాలతో పాటు అత్యవసర సేవల నిర్వహణను జీహెచ్ఎంసీ కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.
కాగా, ఆయా మున్సిపాలిటీలకు చెందిన ఉద్యోగుల జాబితా, స్థిర, చర ఆస్తుల వివరాలు, పెట్టుబడులు, బల్దియా పరిధిలో అమలు చేస్తున్న పథకాలు, పెండింగ్ బిల్లులు, పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల వివరాలతోపాటు, గడిచిన మూడేండ్లలో మంజూరు చేసిన బిల్డింగ్, లే అవుట్ అనుమతులను జాబితా ప్రకారం రూపొందించిన నివేదికను జీహెచ్ఎంసీకి అందజేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. అదే విధంగా ఇప్పుడు బ్యాంక్ ఖాతాల్లోని డబ్బులను జీహెచ్ఎంసీ ఖాతాకు బదిలీ చేయాలని సూచించారు.
ఈ మేరకు బదలాయింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించగా, ఇప్పుడున్న మున్సిపాలిటీ, కార్పొరేషన్ కమిషనర్లను డిప్యూటీ కమిషనర్ల బాధ్యతలను అప్పగించారు. మొత్తం 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను ప్రస్తుతం జీహెచ్ఎంసీలోని సర్కిళ్ల పరిధిలోకి తీసుకొచ్చారు. అదే విధంగా రికార్డులు, నివేదికలను సంబంధిత మున్సిపాలిటీల అధికారులు నియమించిన బల్దియా అధికారులకు అప్పగించాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీల కమిషనర్లను డిప్యూటీ కమిషనర్లుగా వ్యవహరించనున్నారు. ఇక మున్సిపాలిటీలన్నీ బల్దియా సర్కిళ్ల పరిధిలోకి రానున్నాయి.
