సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : అగ్నిప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేసే దిశగా ప్రత్యేక క్యాంపెయిన్‌కు జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం శ్రీకారం చుట్టింది. విద్యాసంస్థలు, దవాఖానలు, వాణిజ్య సంస్థ నిర్వాహకులతో కలిసి ‘అగ్ని ప్రమాదాల ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వాణిజ్య సముదాయాల్లో ఫైర్ ఎన్ఓసీ, ఫైర్ సెఫ్టీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అగ్ని ప్రమాదాలు, నివారణపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించేందుకు నడుం బిగించారు. ఈ మేరకు చక్కగా అర్థమయ్యే విధంగా ఆధునిక వర్చువల్ రియాల్టీ సిస్టంను వినియోగించాలని నిర్ణయించి.. ఈ మేరకు యంత్రం కొనుగోలుకు సిద్ధమయ్యారు. రూ. 3 లక్షల వ్యయంతో ఈ యంత్రాన్ని కొనుగోలు చేసి అవగాహన కల్పించనున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలిగినప్పుడే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని, అగ్ని ప్రమాదాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్ ఎన్. ప్రకాశ్‌రెడ్డి సూచించారు.