వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : భవన నిర్మాణ వ్యర్థాల తరలింపుపై జీహెచ్ఎంసీ విస్తృత అవగాహన కల్పిస్తున్నది. నిబంధనలు ఉల్లంఘించిన యజమానులు, వాహనాలకు ఈవీడీఎం విభాగం భారీగా జరిమానాలు విధిస్తున్నది. ఇందులో భాగంగానే ఎక్కడ పడితే అక్కడ భవన నిర్మాణ వ్యర్థాలు పడేయొద్దని, సీఅండ్‌డీ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలంటూ వాల్‌పోస్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రోస్ స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. భవన నిర్మాణ వ్యర్థాల తరలింపులో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.