సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ మరో సర్వేకు సన్నద్ధమైనది. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మహానగరంలో రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలతో కలిపి సుమారు 19 లక్షల 43 వేల నిర్మాణాలు ఉన్నాయని అంచనా వేసిన అధికారులు, ఈ మేరకు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్) సర్వే చేస్తున్నది. గతేడాది జూలైలో ఈ జీఐఎస్ సర్వేను ప్రారంభించగా అప్పట్లో ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.
ఏజెన్సీ నిర్లక్ష్యంతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతుండగా, మరో ఆరు నెలల సమయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సర్వేకు రూ.22 కోట్ల మేర ఖర్చు చేస్తుండడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్న తరుణంలోనే మరో సర్వేకు సిద్ధమయ్యారు. లే అవుట్లో ఖాళీ స్థలాలు, పార్కులు, ఆట స్థలాలు, మున్సిపల్ మార్కెట్లు, మున్సిపల్ షాపులు, స్లాటర్ హౌస్‌లు, డంపింగ్ యార్డులు మొదలైన స్థిరాస్తులపై సర్వే చేసేందుకుగాను డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (డీజీపీఎస్) తెరపైకి తీసుకువచ్చి సర్వే జరపాలని నిర్ణయించారు.
29 వరకు టెండర్ గడువు
ఈ మేరకు ప్రభుత్వ స్థిరాస్తుల సర్వే, డిజిటలీకరణ, జియో రిఫరెన్సింగ్ తదితరమైనవి చేయగల కన్సల్టెంట్ల సేవలను ఆహ్వానిస్తూ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) టెండర్లను ఆహ్వానించింది. ఈ పనులకు ఎంపికయ్యే కన్సల్టెన్సీ జీపీఎస్ సర్వే కాకుండా అంగుళం వరకు కూడా కచ్చితమైన వివరాలు అందజేయగల డీజీపీఎస్( డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) సర్వే నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సందర్భంగా ప్రయోగాత్మకంగా కూకట్పల్లి, ఎల్బీనగర్ జోనల్ పరిధిలో టౌన్‌ప్లానింగ్ ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టనున్నారు. ఈ నెల 29 వరకు టెండర్ గడువు విధించారు.
స్థిరాస్తులకు యూనిక్ ఐడీ..
ఇందులో భాగంగానే డీజీపీఎస్ సర్వే చేపడుతున్నారు. ప్రతి ఆస్తికి సంబంధించిన విస్తీర్ణం, సరిహద్దులు, చుట్టు పక్కల ఉన్న భవనాలు, రోడ్లు, వాటర్, విద్యుత్, సీవరేజీ వంటి యుటిలిటీస్ లైన్లు తదితరమైనవి డీజీపీఎస్ను ఉపయోగించి చేయాల్సి ఉంటుంది. ఆస్తికి సంబంధించి ప్రతి మూల రియల్ కో ఆర్డినేట్లు గుర్తిస్తూ అన్ని భవనాల ముందు పక్కల లోపల దృశ్యాలు కనిపించేలా ఫొటోలు తీయనున్నారు. జీహెచ్ఎంసీకి సంబంధించిన స్థిరరాస్తులన్నింటికీ యూనిక్ ఐడీ నంబరు ఇస్తారు. అంగుళం కూడా తేడా రాకుండా వాటిని కనిపెట్టడంతో పాటు రియల్ టైమ్‌లోనూ వాటిని ఆన్లైన్ ద్వారా వీక్షించే సదుపాయం ఉండాలని, భవిష్యత్తులో ఎలాంటి వివాదం తలెత్తకుండా ఈ డేటా ఎంతగానో దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు.