సిటీబ్యూరో: చినుకుపడితే విశ్వనగరం చిగురుటాకులా వణికిపోతున్నది. చిన్నపాటి వర్షానికే కాలనీలు మునిగిపోతుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రజలు వరదల్లో చిక్కుకుని అవస్థలు పడుతున్నా జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడంలేదు. వర్షం పూర్తిగా తగ్గిపోయినాక ఏదైనా సమస్య తలెత్తితే తప్ప.. బయటకు రావడం లేదు.
ఎప్పుడు పడితే అప్పుడు కూల్చివేతలు చేపడుతన్న హైడ్రా అధికారులు వర్షంలో తడిసి ముద్దవుతున్న ప్రజల వైపు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. వరద ముంచెత్తి నాలాలు, మ్యాన్‌హోళ్లు పొంగి పొర్లుతూ వరద ఇండ్లలోకి చేరుతున్నా.. సహాయక చర్యల్లో మాత్రం పురోగతి కనిపించడంలేదు. అధికారులు అప్రమత్తంగా ఉండాలనే ప్రకటనలతో సరిపెడుతున్నారు.
బల్దియా కమిషనర్ ఎక్కడ?
గ్రేటర్ హైదరాబాద్‌ను రెండు రోజులుగా భారీ వర్షం ముంచెత్తుతున్నది. జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి అధికారులు, సిబ్బంది సెలవులు తీసుకోవద్దంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రమే సహాయక చర్యల్లో కనిపించారు. జలమండలి, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఎక్కడా జాడ లేరు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాత్రం అందుబాటులో లేనట్లు తెలుస్తున్నది. భారీ వర్షాలతో భాగ్యనగరం అతలాకుతలం అవుతుంటే కమిషనర్ అందుబాటులో లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.
అటు జలమండలి అధికారులేమో తమ పరిధి మ్యాన్‌హోళ్ల వరకేనని గీత గీసుకుని ఉన్నారు. మరోవైపు హైడ్రా సిబ్బంది తమకు జీతాలందడం లేదని సమ్మె చేస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా సీఎం రేవంత్‌రెడ్డి మూడు శాఖలతో ఇప్పటిదాకా ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు. నగర ప్రజల ఇబ్బందులను అటు పాలకులు.. ఇటు అధికారులు పట్టించుకోకపోవడంతో అస్తవ్యస్తంగా మారుతున్నది. కాంగ్రెస్ పాలన, అధికారుల నిర్లక్ష్యంతో నరకం చూస్తున్నామని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలతో స్తంభిస్తున్న నగరం
భారీ వర్షంతో ట్రాఫిక్‌లో నగర వాసులు ఎక్కడికక్కడే స్తంభించిపోతున్నారు. అయితే ట్రాఫిక్ రద్దీని నిలువరించేందుకు పోలీసులు, జీహెచ్ఎంసీ, హైడ్రా సరైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రతినిత్యం నగర వాసులు ట్రాఫిక్‌లో చిక్కుకొని నరకం అనుభవిస్తున్నారు. బుధవారం రాత్రి, గురువారం సాయంత్రం నగరంలో కురిసిన వర్షానికి కిలోమీటర్ దూరం ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది.
గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్‌సిటీ, మాదాపూర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, షేక్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మల్కాజిగిరి, రాజేంద్రనగర్ ఇలా ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ప్రధాన రోడ్లన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధ్దీకరించాల్సిన ట్రాఫిక్ పోలీసులు, వాటర్ లాంగింగ్ పాయింట్ల వద్ద ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన జీహెచ్ఎంసీ, హైడ్రా ఎవరూ కూడా విధుల్లోకి రాకపోవడంతో బుధవారం రాత్రి నగర వాసులు ట్రాఫిక్‌లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడ్డారు.