మల్కాజిగిరి, డిసెంబర్ 3: దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరిలోని పద్మావతి హాల్, అల్వాల్ సర్కిల్ ఇందిరానగర్‌లోని కనకరాజు కల్యాణ మండపంలో దివ్యాంగులకు వీల్ చైర్లు, చేతి కర్రలను ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా దివ్యాంగుల పింఛన్‌ను రూ.6000లకు పెంచుతామని ఉపన్యాసాలతో ఊదరగొట్టారని అన్నారు.
ఎప్పుడో గుప్పించిన హామీలను ఇప్పటికీ అమలు చేయకపోవడంతో దివ్యాంగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పింఛన్లు పెంచేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, అసెంబ్లీలో ప్రత్యేకంగా దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం మాట్లాడుతామన్నారు. దివ్యాంగుల పట్ల అధికారులు అంతా సానుకూలంగా ఉండి వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు.
ప్రతి నెలా ప్రభుత్వ దవాఖానలో సదరం క్యాంపు ఏర్పాటు చేసి వారికి దివ్యాంగుల సర్టిఫికెట్లు సకాలంలో అందేలా కృషి చేస్తామన్నారు. ఇప్పటికే గుర్తించిన దివ్యాంగులకు వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు, చేత కర్రలను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్ల డీసీలు రాజు, శ్రీనివాస్ రెడ్డి, పీఓలు మల్లికార్జున్, కార్పొరేటర్లు శ్రావణ్, శాంతి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంహెచ్ఓ నిర్మల, బాబు తదితరులు పాల్గొన్నారు.