సిటీబ్యూరో: గ్రేటర్లో వాణిజ్య సంస్థలు, వ్యాపారులను జీహెచ్ఎంసీ టార్గెట్ చేసింది. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి సంబంధిత వ్యాపార సంస్థలను సీజ్ చేయాలని నిర్ణయించారు. ట్రేడ్ లైసెన్స్‌లు రెన్యూవల్ చేసుకోని వారిపై 25 శాతం అదనపు రుసుంను వసూలు చేస్తూ ఖజానా నింపుకుంటున్నది. గ్రేటర్లో వ్యాపార సంస్థలకు జీహెచ్ఎంసీ జారీ చేసే ట్రేడ్ లైసెన్స్‌లకు సంబంధించి ఈ నెల 20 (శనివారం)తో ఉచితంగా రెన్యూవల్ చేసే గడువు ముగిసింది.
ఐతే కేవలం 35 వేల మంది మాత్రమే రెన్యూవల్ చేసుకున్నారు. దాదాపు 70 శాతం మంది ట్రేడ్ లైసెన్స్‌లు రెన్యూవల్ చేసుకోలేదు. దీంతో ఆదివారం నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 వరకు రెన్యూవల్ చేసుకునే వారికి 25 శాతం పెనాల్టీతో కలెక్ట్ చేయాలని, ఫిబ్రవరి 20 తర్వాత చెల్లించే వారి నుంచి 50 శాతం జరిమానాతో వసూలు చేయాలని కమిషనర్ జోనల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే వ్యాపారులకు నోటీసులు జారీ చేస్తూ వారి నుంచి ముక్కుపిండి అదనపు వడ్డన భారం మోపేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతుండడం గమనార్హం.
ఇప్పటి వరకు ఆదాయం రూ. 112 కోట్లు
గ్రేటర్ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ డేటా బేస్ ప్రకారంగా మొత్తం 3, 17,033 ప్రాపర్టీలు నాన్ రెసిడెన్షియల్ పరిధిలో ఉన్నాయి. ఇందులో చిన్న చిన్నవి పోను అధికారికంగా 2 లక్షల ట్రేడ్ లైసెన్స్‌లు కనీసం జారీ కావాల్సి ఉంది. ఐతే కేవలం రికార్డుల్లో 1,13,000 మాత్రమే లైసెన్స్‌లు జారీ కాగా..ఇందులో ఇప్పటి వరకు 35వేల మంది మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. తద్వారా రూ. 112 కోట్ల ఆదాయాన్ని రాబట్టుకున్నది. దాదాపుగా 70 శాతం మంది రెన్యూవల్ లేకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. రాబోయే 10 రోజుల పాటు వ్యాపారస్తులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆదాయం పెంచుకునే దిశగా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీకి ట్రేడ్ చెల్లించకుండా ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని ఆదేశించిన నేపథ్యంలో తనిఖీలకు అధికారులు సిద్ధమయ్యారు.
ఐతే ఇంటి దొంగల విషయంలో కమిషనర్ నిఘా పెట్టకపోవడంపై విమర్శలు లేకపోలేదు. ట్రేడ్ లైసెన్స్ రుసుం ..దుకాణం విస్తీర్ణాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడే దీని నుంచి తప్పించుకునేందుకు చాలా మంది దుకాణదారులు విస్తీర్ణాన్ని నామమాత్రంగా పేర్కొని తక్కువ రుసుంతో లైసెన్స్‌ను పొందుతున్నారు. ఇందుకు కొంతమంది క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ రకంగా జీహెచ్ఎంసీ రెండేళ్లలో నాలుగేళ్లలో రూ.25కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. ట్రేడ్ లైసెన్స్‌లలో ట్రేడ్ ఇండెక్స్ నంబరు (టిన్) ఇవ్వకుండా ప్రొవిజన్ విధానంలో…ప్రాపర్టీ ట్యాక్స్ రెసిడెన్షియల్… రెండు మూడింతలు పెరుగుతది. ట్రేడ్ లైసెన్స్ పాత ట్రేడ్ ఇండెక్స్ నంబరు..ఈజీగా ఇవ్వరు.. ప్రొవిజన్ విధానంలో కొనసాగిస్తూ వ్యాపారులతో క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు అందినంత దండుకుంటున్నారన్న విమర్శలు లేకపోలేదు. మొత్తంగా ట్రేడ్ లైసెన్స్‌ల జారీ విభాగాన్ని సమూల ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.