సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీకి ఎర్లీబర్డ్ స్కీం రూపంలో కాసుల వర్షం కురిపించింది. ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలంటూ ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు యాజమానులకు జీహెచ్ఎంసీ అవకాశం కల్పించింది. 30 సర్కిళ్ల పరిధిలో సీఎస్సీ సెంటర్లు, బిల్ కలెక్టర్లు, మీ సేవ , ఆన్లైన్ల ద్వారా చెల్లింపుల ద్వారా రూ. 1000 కోట్ల నిర్ధేశిత లక్ష్యాన్ని ఖరారు చేసుకున్నది. ఈ మేరకు జోన్ల వారీగా లక్ష్యాలను ఖరారు చేసింది.
ఇందులో భాగంగానే 30 సర్కిళ్లకు గానూ దాదాపుగా 8 లక్షల మంది వినియోగదారులు ఎర్లీబర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకున్నారు. దీంతో రూ. 899.93 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకున్నది. అత్యధికంగా శేరిలింగంపల్లి సర్కిల్లో రూ. 124.86 కోట్లు , అత్యల్పంగా చాంద్రాయణ గుట్ట రూ. 3.09 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. చివరి రోజు బుధవారం ఒక్క రోజే 101.69 కోట్లు రాగా మొత్తం టార్గెట్లో రూ.100.7 కోట్ల మేర వెనుకబడింది. ఈ స్థాయి మేర వసూలు రావడం అభినందనీయమని, అధికారుల పనితీరును ఈ సందర్భంగా కమిషనర్ ఆర్వీ కర్ణన్ కొనియాడారు.