నాలా పూడికతీత పనులపై జీహెచ్ఎంసీ అలస్వతాన్ని ప్రదర్శిస్తున్నది.. మృగశిర కార్తె ప్రవేశించి తొలి వానలు పడుతున్నా.. నగరంలో నాలాల పూడికతీత (డీ-సిల్టింగ్ ) పనులు మాత్రం అస్సలు ముందుకు సాగడం లేదు. ‘వాన కాలం ముంచుకొస్తున్నది.. పనులు వేగవంతం చేయండి’ అని జీహెచ్ఎంసీ అధికారులు కాగితాలపై లెకిస్తున్నారే తప్ప.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ప్రధాన నాలాలు, సబ్ -నాలాల నుంచి పూడిక తీసేందుకు బల్దియా రూ. 43.35 కోట్ల బడ్జెట్ను కేటాయించినప్పటికీ, పనుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.
జూన్ మొదటి వారం నాటికే నాలాల పూడికతీత పనులను వంద శాతం పూర్తి చేయాలని టెండర్లు పిలిచినా, చాలా చోట్ల 70 శాతం కూడా పనులు పూర్తి కాకపోవడంతో వరద ముంపు పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల నాలాల నుంచి తీసిన మట్టిని, ప్లాస్టిక్ వ్యర్థాలను, బాటిళ్లను ఎప్పటికప్పుడు తరలించడంలో కాంట్రాక్టర్లు విఫలమవుతున్నారు. తీసిన మట్టిని నాలాల పకనే రోడ్లపై వదిలేయడంతో చిన్నపాటి వర్షానికే ఆ మట్టి అంతా తిరిగి నాలాల్లోనే పడుతోంది. దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం కాస్తా మురికి కాలువల్లో కొట్టుకుపోతున్నది. ఈ నేపథ్యంలో బుల్కాపూర్ నాలా, పికెట్, నాగమయ్య కుంట నాలా పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి.
సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ పరిధిలో వరద నీటి కాలువల పొడవు 1302 కిలోమీటర్ల మేర ఉండగా…390 కిలోమీటర్లు మేజర్ నాలా, మైనర్ డ్రైయిన్స్ 912 కిలోమీటర్లు మేర ఉన్నాయి. ప్రతి ఏటా మాదిరిగానే వరద నీరు సాఫీగా దిగువకు వెళ్లేందుకు పునరుద్ధరణ, మరమ్మతులు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పనులను సకాలంలో జరపకుండా వరద నీటి ముంపునకు అధికారులు కారణమవుతున్నారు. ముఖ్యంగా నాలా పూడికతీత ప్రక్రియను పారదర్శకంగా చేపట్టని ఫలితంగా ప్రతి సంవత్సరం వానాకాలంలో పలు ప్రాంతాలు, కాలనీలు నీట మునుగుతున్నానయి..ఈ విషయంలో ఇంజినీర్ల పనితీరుపై అనేక విమర్శలు వచ్చినా గుణపాఠం నేర్వడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.
అప్పట్లో కిర్లోస్కర్ కమిటీ స్టడీ చేసిన పలు సిఫారస్సులను కూడా అమలు చేయడంలో జీహెచ్ఎంసీ ఘోరంగా విఫలమవుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఏటా కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నా అప్పట్లో వరదల నివారణ కోసం కిర్లోస్కర్ కమిటీ చేసిన సిఫార్సులను బుట్టదాఖలు చేస్తూ కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు తమ బినామీ సంస్థలకు పనులను అప్పగిస్తూ తుతూ మత్రంగా చేపడుతూ ఏటా పూడిక పేరిట కోట్లాది రూపాయలు జేబులు నింపుకుంటున్నట్లు కూడా ప్రచారం సాగుతున్నది. ఈ క్రమంలోనే గత డిసెంబర్ నెలలో నాలా పనులకు టెండర్లు ముగించాల్సిన అధికారులు మార్చి రెండో వారం వరకు కొన్ని చోట్ల టెండర్లతోనే కాలాయాపన చేశారు. ఇప్పటి వరకు నాలా పూడికతీత పనులన్నీ గ్రౌండింగ్లోకి వచ్చి ఇప్పటి వరకు 100 శాతం పూర్తి కావాల్సి ఉంది. కానీ చాలా చోట్ల పనులు పూర్తి కాకపోవడం ఇంజినీర్ల పనితీరుకు అర్థం పడుతున్నది. ఇప్పటికైనా బల్దియా ఉన్నతాధికారులు నిద్రమత్తు వీడి, యుద్ధప్రాతిపదికన నాలాల పూడికతీత పనులు పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు.