సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో ఇంజినీరింగ్ విభాగంలో నిధుల దోపిడీకి చిరునామాగా మారింది. కాంట్రాక్టర్లతో కొందరు చేతులు కలిపి ఖజానాకు కన్నం పెడుతున్నారు. చేయని పనులకు బిల్లులు పెట్టడం.. అనుకూల వ్యక్తులకే టెండర్లు అప్పగించడం వంటి చేయడంలో కొందరు ఇంజినీర్లు సిద్దహస్తులుగా మారారు. ఇటీవల ఏసీబీ దాడులు, విజిలెన్స్ నివేదికలు ఈ ఇంజినీరింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు అద్దం పడుతున్నాయి. సింగరేణి కాలనీ వాంబే క్వార్టర్స్‌లో సీసీ రోడ్డు వేయకుండానే వేసినట్లు బిల్లులు పెట్టి సంస్థ ఖజానాకు రూ. 8.93 లక్షల టోకరా వేసిన ఘటనలో జీహెచ్ఎంసీకి చెందిన ఏఈ అన్సారీని విధుల నుంచి టర్మినెట్ చేశారు. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఏకాంబరంపై సస్పెన్షన్ వేటు వేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిర్ణయం తీసుకున్నారు.
ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని దామోదర సంజీవయ్య నగర్లో వర్షాకాలంలో తరచూ ఎదురవుతున్న వరదనీటి ఇబ్బందులను నివారించేందుకు ప్రస్తుతం ఉన్న నాలాను మిగతా బాక్స్ డ్రైన్‌గా నల్ల పోచమ్మ టెంపుల్ నుంచి ఎక్సైజ్ కాలనీ వరకు బాక్స్ డ్రైయిన్ ఆధునీకరణ 90 లక్షల రూపాయలను కేటాయించి టెండర్లను ఆహ్వానించారు. పనులు చేయకుండానే మేజర్మెంట్ (ఎంబి)లో ఇటీవల రికార్డులు సృష్టించి బిల్లులు పెట్టి రూ.53 లక్షలు, 59 వేల 330 రూపాయలు కాజేసేందుకు ప్రయత్నాలు పెట్టి స్వాహా చేశారు. ఇదే క్రమంలో శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్ పరిధిలో అర్టిస్టిక్ పెయింటింగ్ పనుల టెండర్లలో గోల్మాల్ చేశారు.
సికింద్రాబాద్, ఎల్బీనగర్ వంటి జోన్లో జీవో నంబరు 94ను ప్రామాణికంగా తీసుకోకుండా జీవో 66ను అమలు పర్చుతున్నారు. కానీ శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా 94 జీవోను జారీ చేసి, అనుకూల వ్యక్తులకే టెండర్లు అప్పగిస్తూ వస్తున్నారు. తాజాగా శేరిలింగంపల్లి టెండర్ అప్పగింత వివాదానికి దారి తీసింది. ఎక్కడ లేని విధంగా లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రంగులేసిన అనుభవం ఉండాలని నిబంధన పెడుతూ టెండర్ల వరకు సామాన్యులు రాకుండా అడ్డుకున్న పరిస్థితి. సదరు ఈ రెండు జోన్లలో ఇద్దరు సీనియర్ ఇంజినీర్లు రింగ్ అవుతూ టెండర్లలో పారదర్శకత పాటించడం లేదన్నది ప్రధాన ఆరోపణ.
గతంలో ఏసీబీ అధికారికి పట్టుబడిన ఇంజినీర్కి కీలక జోన్లో బాధ్యతలు నిర్వర్తిస్తుండడం, సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న మరో సీనియర్ ఇంజినీర్‌ను సైతం సంబంధిత కీలక జోన్ నుంచి మార్చాలన్న చర్చ లేకపోలేదు సమన్వయ లోపంలో కుంటుపడిన అభివృద్ధి జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగంలో పాలన గాడితప్పింది.. అడ్డదారి పదోన్నతులు…విధి నిర్వహణలో బాధ్యత లేమి? సామర్థ్యం వ్యక్తులు కీలక స్థానంలో కొనసాగడం వెరసి…గడిచిన కొన్ని రోజులుగా వెలుగుచూస్తున్న అవినీతి, అక్రమాలు ఒకవైపు…కుంటుపడుతున్న నగరాభివృద్ధి మరోవైపు…గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంజినీరింగ్ లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి తోడు సీనియర్, జూనియర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో రాజకీయాలు జరుగుతున్నాయి.
ప్రాజెక్టు విభాగం చీఫ్ ఇంజినీర్ తీరుతోనే అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని చర్చించుకుంటున్న తరుణంలో ఆయన వైఖరిపై ఒక వర్గం ఇప్పటికే గుర్రుగా ఉండగా, తాజాగా ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించి అడ్డదారిలో వచ్చిన భాస్కర్‌రెడ్డికి జీహెచ్ఎంసీలో ఈఎన్సీ, సీఈ ప్రాజెక్టు పోస్టింగ్ ఎలా ఇస్తారని, సీనియర్లను కాదని జూనియర్ ఇంజినీర్‌కు కీలక పదవి అప్పజెప్పారని స్వయంగా పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు మున్సిపల్ సెక్రటరీకి లేఖ రాశారు. భాస్కర్‌రెడ్డి వ్యవహారం శైలి ఇలా ఉంటే మిగతా సీఈ, ఎస్ఈల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. జోనల్లో ఉన్న ఎస్ఈలు ప్రధాన కార్యాలయంలో ఉన్న సీఈల ఆదేశాలను పెడచెవిన పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇష్టారాజ్యంగా కార్పొరేటర్లతో కలిసి ప్రతిపాదనలు పెట్టడం, అవసరం లేని చోట పనులు చేపట్టడం వంటివి జోనల్లో ఎక్కువగా జరుగుతున్నాయన్నది ఇంజినీర్లలో చర్చ జరుగుతున్నది. వివాదాస్పదంగా మారుతున్న ఎస్‌ఈలపై కమిషనర్ దృష్టి సారించి వారికి స్థానచలనం కల్పించాలని, ప్రక్షాళన చేసి అక్రమాలకు పుల్‌స్టాప్ పెట్టాలని సంఘాల నేతలు చెబుతున్నారు.