సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ) : వర్షాల నేపథ్యంలో సీజనల్, అంటువ్యాధులతో పాటు దోమలతో వచ్చే వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. లోతట్టు, స్లమ్ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నది. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగంతో క్షేత్రస్థాయిలో సీజనల్ అంటువ్యాధులతో పాటు దోమల నివారణ, నియంత్రణ, కోసం సిబ్బంది, అధికారులు ఇంటింటికీ వెళ్లి అవగాహనతో పాటు విస్తృతంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిముషాలు 10 వారాల పాటు పరిశుభ్రత పాటించాలని అధికారులు కోరారు. కరపత్రాలు, స్టికర్లు, ఇంటింటికీ అందజేయడం.. ప్రధాన కూడళ్లలో, జన సమూహం ఉండే ప్రాంతాల్లో క్లాత్ బ్యానర్ల ద్వారా ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఎంటమాలజీ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది ఒకొకరికీ కొన్ని కాలనీలకు బాధ్యులను చేస్తూ లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ విభాగంలో 1600 మంది ఏఎల్వోలు పనిచేస్తున్నారని, జీహెచ్ఎంసీ పరిధిలో గల 4846 కాలనీలను మొత్తం కవర్ చేసేందుకు ఒకొకరికీ మూడు కాలనీల చొప్పున కేటాయించినట్లు చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు తెలిపారు.
గోల్నాక, జూలై 28 : ఫీవర్ దవాఖానను రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గురువారం సందర్శించారు. దవాఖానలో కొత్తగా నిర్మిస్తున్న అవుట్ పేషెంట్ భవన నిర్మాణ పనుల పురోగతిని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫీవర్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, డీఈ లక్ష్మీ నరసయ్యతో పాటు సీనియర్ టీఆర్ఎస్ నేత దూసరి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు.