బీఆర్ఎస్ హయాంలో దేశానికే తలమానికంగా, పెట్టుబడులకు స్వర్గధామంగా విరాజిల్లిన హైదరాబాద్ నగరం.. ఇప్పుడు పాలనాపరమైన నిర్లిప్తతకు నిలువుటద్దంగా మారుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన రెండేండ్లలో ఏ ఒక్క ప్రాజెక్టూ పట్టాలెక్కకపోగా..‘ఫ్యూచర్ సిటీ అంటూ కొత్త పల్లవి అందుకుని హైదరాబాద్ అవసరాలను గాలికొదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నగరంలో జరుగుతున్న చిన్నా చితక అభివృద్ధి పనుల్లోనూ ‘రాజకీయాలు’ సాగుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
-సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ)
జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చే ఫిబ్రవరి 10తో ముగుస్తుంది. గత నెలలో జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ వేదికగా ప్రతి కార్పొరేటర్‌కు రూ. 2 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కోటి రూపాయల పనులు కమిషనర్ కర్ణన్, మరో కోటి రూపాయల అభివృద్ధి పనులకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జిల ఆధ్వర్యంలో కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలనలో ఉండే ప్రతిపాదనలకు చకచకా ఆమోదం లభిస్తుండగా, మరో కోటి రూపాయల అభివృద్ధి పనులకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు విపక్ష చూపిస్తున్నారని, విపక్ష పార్టీల కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఓ నియోజకవర్గానికి చెందిన తొమ్మిది మంది కార్పొరేటర్లు కలిసి ఇన్చార్జి మంత్రి వద్దకు వెళ్లి అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు ఆమోదం తీసుకుని వద్దామని వెళితే ..సదరు ఇన్చార్జి మినిస్టర్ కనీసం పరిగణనలోకి తీసుకోకుండా తిరిగి వెనక్కి పంపించడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
ప్రజాస్వామ్యంలో అధికార, ప్రతిపక్షాలు అనే తేడా లేకుండా ప్రజల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. విపక్ష ప్రజాప్రతినిధులను బుట్టదాఖలు చేస్తూ కేవలం అధికార పార్టీ నేతలు చెప్పిన పనులకే పచ్చజెండా ఊపుతోంది. విపక్ష డివిజన్లలో అభివృద్ధి ఆగి ఆగి సాగుతుండగా ప్రజలు మాత్రం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు వివక్షను ఎండగట్టేందుకు విపక్ష పార్టీల కార్పొరేటర్లు సిద్ధమవుతున్నారు. కార్పొరేటర్ల పదవి కాల సమయం మరికొద్ది రోజుల్లోనే ముగుస్తుండడం, ప్రతిపాదనలకు ఆమోదం..ఆపై టెండర్లు, పనుల ప్రారంభానికి సమయం తీసుకునే అవకాశం ఉండడం..వీటిని పరిగణనలోకి తీసుకోకుండా ఇన్చార్జి మంత్రులు వివక్ష చూపిస్తున్నారని మండిపడుతున్నారు. వాస్తవంగా డివిజన్లలో వరద నీటి కాలువలు, నాలాల అభివృద్ధి, రహదారులు, తాగు, మురుగునీటి పనులు, కమ్యూనిటీ హాల్స్ వంటి కనీస వసతుల కోసం కార్పొరేటర్లు ప్రతిపాదనలు పంపిస్తుంటారు. గడిచిన రెండేళ్లలో నిధుల కేటాయింపులు లేక ఇబ్బందులు పడినప్పటికీ..డివిజన్‌కు రూ. 2కోట్ల అభివృద్ధి పనులు కొంచెం ఊరట కలిగించిన ఇన్చార్జి మంత్రుల వ్యవహార శైలితో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు హెచ్చరిస్తుండడం గమనార్హం.

రూ.2 కోట్ల నిధుల కేటాయింపులో భాగంగా రూ. కోటి మేర జీహెచ్ఎంసీ కమిషనర్ ఖాతా నుంచి ప్రతిపాదనలకు మోక్షం కలగాల్సి ఉండగా..వీటికి చకచక ఆమోదం లభిస్తున్నాయి. కోటి రూపాయల్లో 80 లక్షలు ఇంజనీరింగ్ (జీహెచ్ఎంసీ సివిల్ వర్క్స్), రూ.20 లక్షలు జలమండలికి సంబంధించినవి ఉండాలని నిబంధన. అయితే జీహెచ్ఎంసీకి సంబంధించి ఎక్కువగా సీసీ రోడ్ల పనులు ఉంటుండడం గమనార్హం. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 300కోట్ల మేర సీసీ రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జలమండలికి సంబంధించి ప్రతిపాదనలకు సకాలంలో ఆమోదం పొందడం లేదని, అక్కడి అధికారులు సమయం తీసుకుంటున్నారని కార్పొరేటర్లు చెబుతున్నారు.