సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ఆరవ జనరల్ బాడీ సమావేశాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వాయిదా వేశారు. బుధవారం జీహెచ్ఎంసీ సమావేశం మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముందుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న, గుడిమలాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ మృతితో పాటు ఇటీవల ఉగ్రవాద దాడిలో మృతి చెందిన సైనికులకు సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆనంతరం మేయర్ మాట్లాడారు. నగరంలో సీఎం కేసీఆర్ 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని స్మారక చిహ్నంగా నిర్మించినందుకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుందన్నారు. కొత్తగా నిర్మితమైన నూతన సచివాలయాన్ని తెలంగాణ రాష్ట్రానికే ప్రతిష్టాత్మకమైందన్నారు. మేడే సందర్భంగా సఫాయి అన్న నీకు సలాం నినాదంతో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు రూ. 1000 పెంచడం సంతోషదాయకమన్నారు.
ప్రజా సమస్యలను సత్వర పరిషారానికి కాలనీ రెసిడెన్షియల్, స్లమ్ ఏరియా ఫెడరేషన్ ప్రతినిధులతో వారి వద్దకు వెళ్లి నగరంలోని 4846 కాలనీల సమస్యలను పరిషరించడానికి నోడల్ టీమ్‌లు విశేష కృషి చేస్తున్నాయని మేయర్ తెలిపారు. ఇందుకు 360కి పైగా టీమ్‌లు పనిచేస్తున్నాయని వివరించారు. దీంతో పాటు కుక కాటు ప్రమాదాలను నివారించడానికి హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసి కమిటీ సిఫార్సుల ఆధారంగా జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న జంతు పరిరక్షణ కేంద్రాలను పరిశీలించి అకడ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు, కుకకాటు నివారణకు తగిన చర్యలను హై లెవల్ కమిటీ సూచనల మేరకు, యానిమల్ వెల్ఫేర్ బోర్డు మార్గదర్శాలకు అనుగుణంగా జీహెచ్ఎంసీ పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని మేయర్ వివరించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు అన్యాక్రాంతం కాకుండా సీఎస్ఆర్ పద్ధతిలో పలు సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. మొదటి దశలో 25, రెండో దశలో 18 మొత్తం 43 చెరువుల సుందరీకరణ, కట్ట పటిష్టత, మురుగు నీరు డైవర్షన్ తదితర పనులను రెగ్యులర్‌గా చేపడుతామని చెప్పారు.
సభ వాయిదా పడింది ఇలా..
తదనంతరం మేయర్ మాట్లాడుతూ లంచ్ తర్వాత సమావేశం జరుగుతుందని ప్రకటించడంతో బీజేపీ కార్పొరేట్లు సభ నిర్వహించాలని మేయర్‌ను కోరడంతో ఆమె అనుమతిచ్చారు. కొందరు కార్పొరేటర్లు నిన్న జలమండలి కార్యాలయం వద్ద అనుచితంగా ప్రకటించడంతో జలమండలి డైరెక్టర్లు డాక్టర్ ఎం సత్యనారాయణ, డైరెక్టర్ల బృందం అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్లు వ్యవహరించిన తీరు సరిగా లేదని, 186 కిలోమీటర్ల నుంచి గోదావరి నీటిని, 110 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా జలాలను నగరానికి తీసుకువచ్చి ప్రజలకు సమృద్ధిగా నీరు అందిస్తున్నామని, 200 మి.ని ఎయిర్‌టెక్ మిషిన్లతో సీవరేజీ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు జలమండలి ఈడీ సత్యనారాయణ తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా అధికారులంతా పనిచేస్తుంటే..ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా పూడికతీత మట్టిని ప్రధాన కార్యాలయంలో చల్లడం, మహిళా ఉద్యోగులను బీజేపీ కార్పొరేటర్లు అగౌరవ పర్చిన తీరు సరికాదంటూ నిరసనగా జలమండలి డైరెక్టర్లు కౌన్సిల్ సమావేశం నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.
బల్దియా అధికారులు కూడా..
వీరికి మద్దతుగా తాము కూడా బాయ్‌కాట్ చేస్తున్నామని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల బృందం తెలిపారు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు మేయర్ పోడియం ముట్టడించడంతో మేయర్ సభను వాయిదా వేశారు. ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు వాణీదేవి, మహ్మద్ రహమత్ బేగ్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ డీ.ఎస్.లోకేశ్ కుమార్, అడిషనల్ కమిషనర్ ప్రియాంక అలా, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి, ఈఎన్సీ జియా ఉద్దీన్, సురేశ్ కుమార్ సీసీపీ దేవేందర్ రెడ్డి, అడిషనల్ సీసీపీ శ్రీనివాస్, అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెన్నెడీ, విజయలక్ష్మి, జోనల్ కమిషనర్లు శంకరయ్య, మమత, పంకజ, సామ్రాట్ అశోక్, శ్రీనివాస్ రెడ్డి, రవి కిరణ్, సెక్రటరీ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి
జల మండలి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల విధులకు బాధ్యత గల కార్పొరేటర్లు ఆటంకం కలిగించడం హేయమైన చర్య అని, ఈ దాడులను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం హైదరాబాద్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా శాఖ అధ్యక్షుడు ఎంబీ కృష్ణ యాదవ్, కార్యదర్శి డాక్టర్ హరికృష్ణ అన్నారు. భాధ్యత గల కార్పొరేటర్ పదవిలో కొనసాగుతూ తమ హోదాను మరి చి వ్యవహరించడం తగదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరసన ముసుగులో ఇష్టానురీతిన వ్యవహరించిన బీజేపీ కార్పొరేటర్లు ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.