GHMC | సిటీబ్యూరో, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న దరిమిలా..కార్పొరేటర్లు స్టడీ టూర్లకు సిద్ధం కావడం విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఖజానాలో నిధుల్లేక నెలవారీగా సిబ్బంది జీతాల చెల్లింపులకే కనాకష్టంగా మారిన తరుణంలో ఇతర నగరాల బాట పట్టేందుకు కార్పొరేటర్లు సన్నద్ధమయ్యారు.
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు మొత్తం 150 మంది ఒకేసారి కాకుండా ట్రిప్పులో 50 మంది చొప్పున మూడు విడతలుగా మూడు ప్యాకేజీల్లో ఆయా నగరాలను చుట్టి వచ్చేందుకు టూర్ సిద్ధం చేశారు. ఇందుకు దాదాపు రూ.1.25 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసేందుకు ప్రణాళిక రచించారు. ఈ మేరకు ట్రావెల్స్ ఏజెన్సీల నుంచి కొటేషన్లు ఆహ్వానించుటకు గురువారం స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. మూడు విడతల్లో ఒక్కో విడతకు 50 మంది చొప్పున స్టడీ టూర్‌కు వెళ్లేందుకు మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
కాంట్రాక్టర్లకు రూ.1500 కోట్ల బకాయిలు ఒకవైపు.., ఆదాయం లేక సిబ్బంది జీతాల చెల్లింపులు, నిర్వహణ పనులకు నిధుల్లేక ప్రాజెక్టులు ఢీలా పడిన పరిస్థితి. మరోవైపు అధ్వాన్నపు పారిశుద్ధ్యం, దోమలు, డెంగీ, మలేరియా కేసులు, కుక్కల కాట్లు, ట్రాఫిక్ జామ్‌లతో ప్రజలు అల్లాడిపోతున్నారు. చిన్నపాటి వర్షానికే గ్రేటర్ ప్రజానీకం ఉక్కిరిబిక్కిరవుతుంది.
ఇటువంటి తరుణంలో ఆదాయ వనరులను సమకూర్చడంతో పాటు వచ్చిన ఆదాయంతో ప్రజలకు అవసరమైన అభివృద్ధి, పౌర సేవల నిర్వహణను చేపట్టాల్సిన కార్పొరేటర్లు ఖాజానాలో చిల్లి గవ్వ లేనప్పుడు స్టడీ టూర్లకు వెళ్లడం ఎంత వరకు సమంజసం? అని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి ప్రయత్నాలు, గొంతెమ్మ కోర్కెలు కార్పొరేషన్ మనుగడను ప్రశ్నార్థకం చేసే ప్రయత్నాలేనన్న విమర్శలు సైతం లేకపోలేదు.
స్టడీ టూర్లతో దుబారా తప్ప ఒరిగేదేమీ లేదన్న చర్చ జరుగుతున్నది. ఐతే, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు స్టడీ టూర్ల పేరిట విహార యాత్రలు చేయడం కొత్తేమీ కాదు. పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ రోడ్ పనులు, ఇతరత్రా అంశాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకని చెబుతున్నారు. ఐతే దేశంలోని పలు నగరాల నుంచి మేయర్లు, కార్పొరేటర్లు, అధికారులు జీహెచ్ఎంసీలోని బెస్ట్ ప్రాక్టీసెస్‌ను అధ్యయనం చేయడానికి వస్తుండగా, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఇతర నగరాలకు వెళ్లడం నిధుల దుబారా తప్ప మరొకటి కాదని జీహెచ్ఎంసీ వర్గాలే అంటున్నాయి.
టూర్లు ఇలా…
ఫేజ్-1:- ఢిల్లీ, ఆగ్రా, జైపూర్
ఫేజ్ 2:- ఇండోర్, లక్నో
ఫేజ్ 3:- అసోం గౌహతి