సిటీబ్యూరో, అక్టోబరు 17 (నమస్తే తెలంగాణ): శాసనసభ ఎన్నికల్లో పనిచేసిన బిల్లులను విడుదల చేయడం లేదని, సంవత్సరాల తరబడి అధికారులు కాలయాపన చేస్తున్నారని హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల కాంట్రాక్టర్స్ (జీహెచ్ఎంసీ-టీఎస్ఎల్ఏ -2023) మండిపడ్డారు. రెండేళ్లుగా అధికారులు జాప్యం చేస్తున్నారని, ఇందుకు నిరసనగా ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలకు సంబంధించిన తమ కాంట్రాక్టర్లు చేయవలిసిన పనులన్నీ బైకాట్ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు. అధికారుల తీరును ఎండగడుతూ శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు.
15 నియోజకవర్గాలకు సంబంధించిన శాసన సభ ఎన్నికలకు 273 మంది పనిచేశారని, 2023 అక్టోబరు 20 నుంచి పోలింగ్ బూత్లు, డీఆర్సీ సెంటర్, స్ట్రాంగ్ రూంలు, ఫొటోగ్రఫీ, ఎలక్ట్రికల్ అరెంజ్మెంట్స్, ఫుడ్, లేబర్ సఫ్లయి, ట్రాన్స్పోర్టేషన్, టెంట్ సామాగ్రి, టేబుల్స్, కుర్చీలు వంటి ఎలక్షన్ సంబంధిత పనులు చేసినట్లు కాంట్రాక్టర్ సాయి వివరించారు. 2023 డిసెంబర్లో కాంట్రాక్టర్లు సంబంధిత అధికారులకు బిల్లులను సమర్పించారని, అధికారులు హోల్డ్ (తాత్కాలిక నిలుపుదల) చేశారన్నారు. దీనిపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ సీఈఓలను పలుమార్లు కలిసి వినతిపత్రం సమర్పించామని, ఢిల్లీకి వెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారులకు వినతులు ఇచ్చినట్లు తెలిపారు. 2024 డిసెంబరు 5వ తేదీన రూ.27.50 లక్షల పేమెంట్ ఆర్డర్ ఇవ్వాలని తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిందన్నారు. 2025లో కేవలం రూ.11.25 లక్షలకే టోకెన్స్ జనరేట్ చేసి ట్రెజరీకి పంపినట్లు సాయి పేర్కొన్నారు.
23 ఆగస్టు 2025న సెక్రటేరియట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అఫ్రూవల్ లభించిందన్నారు. కానీ జీహెచ్ఎంసీలోనే పెండింగ్ పెట్టారని, రెండు నెలలుగా ఎలక్షన్ అదనపు కమిషనర్ లాగిన్లో దస్త్రం పెండింగ్ పెట్టారన్నారు. ఈ ఉప ఎన్నిక తర్వాత మరో అదనపు కమిషనర్ వస్తారు తనను అడగమని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడాన్ని కాంట్రాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. చేసిన పనులకు ఇప్పటికే సొంతంగా డబ్బులు చెల్లించుకొని వాటికి వడ్డీలు కడుతూ ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్న కాంట్రాక్టర్లు అధికారులు ఇలాగే వ్యవహరిస్తే జూబ్లీహిల్స్ పనులు నిలిపివేస్తామని ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు హెచ్చరించారు.